ఈ పుట అచ్చుదిద్దబడ్డది

శ్రీ స్త్రీ నీతి దీపిక


తే.గీ. శ్రీకరుండు, పవిత్రుండు, లోకగురుఁడు,
సర్వశక్తుఁ, డనంతుఁడు, శాశ్వతుండు,
సర్వకారుణ్యుఁ, డభవుండు, సర్వసాక్షి,
యయిన దేవర నుతియింతు నాత్మయందు. 1.
                                 దైవభక్తి

తే.గీ. ప్రతిదినంబును నిక్కంపు భక్తితోడ
మూడు వేళలయందును ముఖ్యముగను
జెలువరో! పెక్కుమేళ్ళను జేసినట్టి
యీశ్వరుని వేడుఁకొమ్ము నీహృదయమందు. 2.

తే.గీ. భోజనము చేసి, నిదురింపఁ బోవునపుడు
నిత్యమును రాత్రి యీశ్వరు నెలఁతలార!
ధ్యాన మొనరింపఁ డెదలోనఁ దనువు మఱచి
పవ్వళించెడుతఱిని గాపాడుకొఱకు. 3.

ఆ.వె. పడఁతులార! మరలఁ బ్రార్ధింపుఁ డీశ్వరుఁ
బడకనుండి లేవతడవ విూరు;
మేను మఱచి నిద్ర పూనియున్నప్పుడు
కరము కరుణ మిమ్ము నరసెఁగాన. 4.
 
తే.గీ. సంపదలు వచ్చినప్పుడు సాదరముగ
నట్లుదయచేసినందుకు, నాపదైన