ఈ పుట ఆమోదించబడ్డది

నడగించి ధర్మమును నిలువబెట్టెదరు. ఇదియే నిజమగుధర్మము. ఈధర్మమునే మహాభారతయుద్ధసమయమున నర్జునుడు హింసకు భయంపడి మ్రాన్పడి యున్నప్పుడు కృష్ణభగవానులు, ఆయనకు శ్రుతుల యందలి గీతావాక్యముల నుపదేశించుచు "పరిత్రాణాయాసాధునాం వినాశాయ చదుష్కృతాం, ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగేయుగే" అని చెప్పెను."ఓ అర్జునుడా! సత్పురుషులను రక్షించుటకును దుర్మార్గులను శిక్షించుటకును ధర్మమును నిలువబెట్టుటకును ప్రతియుగమునందును నవతారము నెత్తుచున్నాను." అని దీనికి తాత్పర్యము. ప్రకృతము మన వేమనకవిగారు అట్టిభగవదవతారములలో జేర్పదగినవాడు. ఈయన పదునైదవశతాబ్దములోనివాడు. రెడ్లు అనునాలవజాతివా రగు శూద్రజాతిలో జేరినవారు.

వేమన స్థలకాలాది నిర్ణయము.

వేమన్న యన ఎవ్వరినో సాధారణముగా చెప్పు "కామన్నమల్లన్నల" బోలె తలంపనలదు. ఈ మహానుభావు డాగర్భశ్రీమంతుడు. మహారాజుకూడను. వీరిది రెడ్లవంశము. ఆంధ్ర దేశమును పాలించిన రెడ్ల రాజులు కొందఱు అద్దంకిని రాజధానిగా చేసికొనియు మఱికొందఱు కొండవీటిని రాజధానిగా చేసి కొనియును పాలించిరి. ఇఱు తెగలలోను వేమన యను