ఈ పుట ఆమోదించబడ్డది

పీఠిక


బ్రహ్మశ్రీ వేటూరి ప్రభాకరశాస్త్రిగారు సంపాదించి ప్రకటించిన ప్రబంధరత్నావళిని బరికింతుమేని యెన్నియేని ప్రాచీనప్రబంధరత్నములు తెలుఁగుబాసకుఁ బెట్టని తొడవులై విలసిల్లియుండెడివని తెలియవచ్చెడిని. ఆయాప్రబంధములనుండి యందుద్ధృతములైన పద్యములు వానివాని యౌత్కృష్ట్యమును, కవితామాధుర్యమును వేనోళ్లఁ జాటుచున్నని. ఆగ్రంథములు నామమాత్రావశిష్టములై యిపుడు లభింపకుండుటచే నాంధ్రవాఙ్మయమునకుఁ దీరనిలోటు వాటిల్లినది. విస్మృతప్రాయములయిన యట్టిగ్రంథరత్నములలో నొకటియగు నీమలహణచరిత్రమున కేకైకమగుమాతృక యిటీవల మన భాగ్యవశమునఁ దెలుఁగునాట లభించినది. దీనికి

కృతికర్త

ఎడపాటిఎఱ్ఱనార్యుఁడు. గ్రంథావతరణిక వలనను, ఆశ్వాసాంతగద్యములవలనను ఈతఁడు 'శివభక్తినిధి' యనియు, 'మంత్రి' (నియోగిబ్రాహ్మణుఁడు) యనియు “కవితాభిజ్ఞుఁ' డనియు, కౌండిన్యకులోద్భవుఁ" డనియు, కృతిపతికిఁ 'గడుఁగూర్చుబంధు' వనియు, 'ఎడపాటిపురాధిపుఁ' డనియు (ఎడపాటికిఁ గరణము కావచ్చును.), 'సోమయామాత్యుని