పుట:Sringara-Malhana-Charitra.pdf/125

ఈ పుట అచ్చుదిద్దబడ్డది


క.

పరమేశు నాఁటిరాత్రిన్
బరికించినఁ దమకు నిలువ భార మటంచున్
దురితంబులు నిద్రాకృతి
సురమునిముఖ్యులకునైనఁ జూడ్కులఁ గ్రమ్మున్.


వ.

అని చెప్పి రుద్రాక్షభూతిభూషణుం గావించి నిజోద్యానమున నున్న శివలింగంబునకు మ్రొక్కించి గంధపుష్పాక్షతలు, ధూపదీపనైవేద్యంబులు సమర్పించి సర్వేశ్వరున కర్పించుమని యతనికరంబున కొండొండ యందిచ్చుచుం బ్రియంబున.


సీ.

అర్కపుష్పంబుల నభవునిఁ బూజింపఁ
                   బరధనాహరమహాపాప మణఁగు
దూర్వాంకురంబుల శర్వునిఁ బూజింపఁ
                   బరసతీసంగమపాప మణఁగు
తులసీదళంబుల ధూర్జటిఁ బూజింపఁ
                   బరనిందచే నైన పాప మణఁగు
మారేడుదళముల మఱి శివుఁ బూజింప
                   బ్రహ్మహత్యాదికపంక మణఁగు