పుట:Srikrishnudu-Choopina-Maargamu.pdf/149

ఈ పుట ఆమోదించబడ్డది

మును ప్రసాదించిన తల్లి నాచిన్న నాడే గతించినది. కాని నాటినుండియు నీశాశ్వతమాత యామెలేనికొరతను సంపూర్ణముగా తొలగించి నాకండయై నిలిచినది. ఆమె ఎన్నడును మారలేదు. ఎన్నడును నాకు బాసటయై నిలువకయుండలేదు. కష్టములును, దుఃఖములును సంప్రాప్తించినప్పు డామెహృదయములో తలదాచుకొందును.


సాధారణజనులకు గీత చాల కష్టమైన గ్రంథమని యప్పుడప్పుడు వినుచుందుము. ఈ యాక్షేపణ నిరాధార మైనదని నాయభిప్రాయము. అఖండపాండిత్యమును సంపాదించిన కీర్తిశేషుడైన లోకమాన్యుడు గీతపై గొప్ప వివరణమును వ్రాసినాడు. అది యతనికి తన శేముషి నుపయోగించి గొప్ప సత్యములను గ్రహించుటకొక నిధానముగ నుండినది. అట్లని సాధారణమనుష్యుడు భయపడనక్కరలేదు. గీతలోని పదునెనిమిది యధ్యాయములను జదివి బోధపరుచుకొనుట నీకు కష్టమని తోచినయెడల దానిలోని మొదటిమూడధ్యాయములను మాత్రమే శ్రద్ధగ చదువవచ్చును. తక్కిన పదునే నధ్యాయములలోను వేర్వేరు దృక్పథములనుండి వివరముగా దెలుపబడినదంతయు సంగ్రహముగా నీ మూడధ్యాయములలో నిమిడియున్నది.


ఈ మూడధ్యాయములలోని ముఖ్యాంశము కూడ అక్కడక్కడ కొన్నిశ్లోకములలోమాత్రమే యర్థమంతయు