పుట:Sri Mahabagavathamu Vol 1.pdf/208

ఈ పుట అచ్చుదిద్దబడ్డది

36

మ. నినుఁ జింతించుచుఁ బాడుచుం బొగడుచు న్నీ దివ్యచారిత్రముల్

వినుచుం జూతురు గాక లోకు లితరాన్వేషంబులం జూతురే ?

ఘన దుర్జన్మ పరంపరా హరణ దక్షంబై మహాయోగి వాగ్

వినుతంబైన భవత్‌పదాబ్జ యుగమున్ విశ్వేశ ! విశ్వంభరా ! (1-196)


వ. దేవా ! నిరాశ్రయులమై భవదీయ చరణారవిందముల నాశ్రయించి నీవారలమైన మమ్ము విడిచి విచ్చేయనేల ? నీ కరుణావలోకనంబుల నిత్యంబును జూడవేని యాదవ సహితులైన పాండవులు జీవునిం బాసిన యింద్రియంబుల అచందంబునఁ గీర్తిసంపదలు లేక తుచ్ఛత్వంబు నొందుదురు. కల్యాణ లక్షణ లక్షితంబులైన నీ యడుగుల చేత నంకితంబైన యీ ధరణీమండలంబు నీవు వాసిన శోభితంబు గాదు. నీ కృపావీక్షణామృతంబున నిక్కడి జనపదంబులు కుసుమ ఫలభరితంబులు నోషధి తరు లతా గుల్మ నద నదీ నగ సాగర సమేతంబులునై యుండు. (1-197)


ఉ. యాదవులందుఁ బాండుసుతులందు నధీశ్వర ! నాకు మోహ వి

చ్ఛేదము సేయుమయ్య ! ఘనసింధువుఁ జేరెడి గంగ భంగి నీ

పాద సరోజ చింతనముపై ననిశంబు మదీయ బుద్ధి న

త్యాదర వృత్తితోఁ గదియునట్లుగఁ జేయఁగదయ్య ! యీశ్వరా ! (1-198)


శా. శ్రీకృష్ణా ! యదుభూషణా ! నరసఖా ! శృంగార రత్నాకరా !

లోకద్రోహినరేంద్రవంశదహనా !లోకేశ్వరా ! దేవతా

నీక బ్రాహ్మణ గో గణార్తి హరణా ! నిర్వాణ సంధాయకా !

నీకున్ మ్రొక్కెదఁ ద్రుంపవే భవలతల్ నిత్యానుకంపానిధీ ! (1-199)


వ. అని యిట్లు సకల సంభాషణంబుల నుతియించు గొంతి మాటలకు నియ్యకొని గోవిందుండు మాయా నిరూఢ మందహాస విశేషంబున మోహంబు నొందించి రథారూఢుండై కరినగరంబునకు వచ్చి కుంతీ సుభద్రాదులన్ వీడ్కొని తన పురంబునకు విచ్చేయ గమకించి ధర్మరాజుచేఁ గించిత్కాలంబు నిలువుమని ప్రార్థితుండై నిలిచె. అంత బంధువధ శోకాతురుండైన ధర్మజుండు నారాయణ వ్యాస ధౌమ్యాదులచేతఁ దెలుపంబడియుఁ దెలియక మోహితుండై నిర్వివేకంబున నిట్లనియె. (1-200)