పుట:SriAndhrakaviTharangeniSamput6.djvu/14

ఈ పుట అచ్చుదిద్దబడ్డది

శ్రీరామచంద్ర

ఆంధ్రకవితరంగిణి

ఆఱవసంపుటము

69. శ్రీధరుఁడు

ఇతనిచరిత్ర మేమియుఁ దెలియదు. ఈతఁ డొకఛందోగ్రంథమును రచించినట్లు లక్షణవేత్తలు తమలక్షణగ్రంథములయం దీతనిపద్యముల నుదాహరించియుండుటచే నీతని పేరు తెలియవచ్చినది. ఈ క్రిందిపద్యములు రంగరాట్భందము నం దుదాహరింపఁబడినవి.

క.

మగణం బెప్పుడు శుభకర
మగు నైనన్ గ్రూరగణము నది డాసినఁచో
దెగి చంపు బుధుఁడు క్రూరుం
డగుగ్రహమును గదిసి క్రూరుఁడై చనుమాడ్కిన్.


క.

సురనరతిర్యగ్రౌరన
నరగతు లగుభూసురాదివర్గాక్షరముల్
గురులఘువులు నరసురగతు
లరిరాయవిఫాల సోమయవనిపాలా!


క.

అల్పప్రాణము లతిమృదు
జల్పోచితవచనపంక్తి ఝ ఛ ఘ ఢ ఠములౌ
నల్పకఠోరాక్షరముల
వల్పాటగునవి మహాయుతప్రాణంబుల్.


క.

విదితముగ రాహుభుక్తికి
నొదవినపడుమూఁడు జీవయుక్తము లవి యు
న్నది మొదలు నెదుటితారలు
పదునాలుగు మృతము లనఁగఁబడు నెల్లెడలన్.