ఈ పుట ఆమోదించబడ్డది

31

ప్రామాణ్యంతోనే తరవాతవారు వేదాలకులాగే తమిళవేదానికి ఒక వింగడింపూ, అధ్యయన పద్ధతి, అక్కడి స్వరపద్ధతికి దీటుగా ఇక్కడ నియతరాగతాళగాన పద్ధతి, దాని స్వస్తి విధానానికి ప్రతిబందిగా సేవాకాల విధానం-ఇట్లు ఏర్పరిచి ద్రావిడవేదమనీ, ద్రావిడవేదాంతమనీ సుదృఢమయిన వ్యవస్థను రూపొందించేరు. అల్లాంటి వ్యవస్థయేదీ లేకపోవటంవల్లా తరవాతి వారి ప్రోత్సాహం లభించక పోవటమేకాదు కొందరు దురర్థసంప్రదాయానుయాయుల మౌర్ఖ్యం పెద్ద అవరోధం కావటంవల్లా, సువ్యవస్థగానో అవ్యవస్థగానో వేదప్రమాణాలుగానో ఏదో అప్రమాణంగానో అసలాయన వచనాలు నిలిచి తెలుగు జాతికి లభిస్తే బాగుండుననేటట్టుంది యిక్కడి స్థితి.

తమిళవేదం - దేశిదృక్పథం

ఆళ్వారుల దివ్యప్రబంధాన్ని 'ద్రావిడవేదం' అనటంలో-వారు బంధురభక్తిభావ పారవశ్యంతో పరమేశ్వరుణ్ణి కీర్తించటంతో వారిపై పేర్కొన్న బ్రహ్మాండమైన భక్తిభావం తదనుయాయులచేత అట్లా పలికించింది. రెండోది-ఆళ్వారులు కృష్ణభక్తి సంప్రదాయాన్ననుసరించటం. తమిళంలో పాడటం, వారు పరస్పరం, వారందర్నీ తరవాత వారూ, వర్ణవ్యవస్థాపరిధుల్ని అతిక్రమించి గౌరవించి అనుసరించటం, వేదానికి ప్రతిద్వంద్విగా, ప్రతికోటిగా ద్రావిడ-వేద-వేదాంత వ్యవస్థ ఒకటి నెలకొల్పటం ఇవన్నీ మౌలికంగా భాగవత సంప్రదాయంలోనూ, తమిళభాషా వాఙ్మయచరిత్రలోనూ ఉండే స్వతంత్రచ్ఛాయల్నీ, దేశితనాన్ని విస్పష్టంగా ప్రకటించుతాయి. అంతర్యవనికంగా ఇంత వ్యవహారం తమిళవేదానికి ఉన్నది. ఈ దృష్టితోనే కృష్ణమాచార్యుల తెలుగువేదాన్నీ మనం పరిశీలించాలి.

తెనుగు వేదం - విమర్శకుల అపార్ధం

మొట్టమొదట కృష్ణమాచార్యుల వాఙ్మయాన్ని తెనుగువేదంగా పేర్కొన్నఘనత తాళ్ళపాక తిరువెంగళనాథునిది. “వేదంబు తెనుగు గావించి సంసారఖేదంబు మాన్చిన కృష్ణమాచార్యు" అని అతడు పూర్వాచార్యసంస్మరణం చేస్తూ అంటాడు. అయితే ఇక్కడ మన విమర్శకులం