ఈ పుట అచ్చుదిద్దబడ్డది

శ్రీరంగమహత్త్వము

257


చ.

ధనకనకాదివస్తువులు దాన మొనర్పుము, దానఁజేసి చ
య్యనఁ బెడఁడాయు నీయఘము లన్నియు, నంత ననంతకీర్తియున్
ఘనతరరాజ్యవైభవసుఖంబుఁ బవిత్రచరిత్రులైన నం
దనులు ననామయత్వము ఘనంబగు నాయుపు నీకుఁ గల్గెడిన్.

252


వ.

అని యుపదేశించి యారాజుచేతఁ బూజితుండై నిజాశ్రమంబునకుఁ
జనియె, సోమకుండును బ్రహృష్టమానసుండై తదుపదిష్టప్రకారంబున
కళత్రమిత్రాప్తబంధుసమేతంబుగాఁ బుష్కరిణీతీర్థంబున కరిగి కృతస్నా
నుండై యచ్చట హిరణ్యాదినానావిధదానంబుల విప్రుల నతితృప్తులఁ
గావించి నిత్యమంగళాభిరామంబగు శ్రీరంగధామంబునకుం బోయి తద
భ్యంతరంబున.

253


సీ.

పుండరీకాక్షుఁ బ్రస్ఫురితకౌస్తుభవక్షు
నాజానుబాహు నీలాభ్రదేహు,
మకరకుండలకర్ణు మహితకృపాపూర్ణు,
నవపీతకౌశేయు నతవిధేయు,
లక్ష్మీసముల్లాసు లలితకోమలహాసు
నానావిధాకల్పు నాగతల్పు,
బహువేదసంవేద్యు భవమహామయవైద్యు
వరతులసీదాము సురలలాముఁ


తే.

గలితశృంగారుఁ, ద్రిగుణవికారదూరు,
శోభనాకారు భువనసంస్తుతవిహారు,
యోగిహృద్గేయు నిజభక్తిభాగధేయు,
సకలఫలదాయి శ్రీరంగశాయి గనియె.

254


క.

ధరఁ జాగి మ్రొక్కి రత్నా
ధరణసువర్ణాంబరాది బహువస్తుతతుల్,
పరువడిఁ గానుక లిడి సు
స్థిరమతి తత్పూజనంబుఁ జేసినపిదపన్.

255