ఈ పుట అచ్చుదిద్దబడ్డది

శ్రీరంగమహత్త్వము

249


గాల మెసఁగి పొల్చు కావేరితటమున
నొక్కదినముఁ బాయకున్న వాడు.

211


క.

నీ వచటికిఁ దడయక చని
యావిద్వత్ప్రవరు చిత్త మలరఁగ భక్తిన్
సేవించి యడుగు మెఱుఁగుము
కావలసిన వెల్ల నతఁడు క్రమమునఁ దెలుపున్.

212


తే.

అనిన నాతాపసోత్తముఁ డబ్జమిత్ర!
యతులితజ్ఞాననిధియైన యమ్మహాత్ముం
డేమి కతమునఁ దానొందె నీఖగత్వ
మానతిమ్మన్న నతని కిట్లనియె నినుఁడు.

213


క.

ఖగవిహగప్రముఖాకృతు
లొగిఁ బూని మహాత్ము లుందు రొక్కొకయెడలన్
జగమున దమతమ తలఁపులు
నిగిడిన సంప్రీతి నదియె నెపము దలంపన్.

214


మ.

క్షితిపైఁ జిక్లిత కాఖ్యకద్విజుఁడు లక్ష్మీనాయకున్ మున్ను స
న్మతి నత్యుగ్రతపంబు పెంపునఁ బ్రసన్నస్వాంతుఁ గావింప నా
శ్రితరక్షామణియైన యవ్విభుఁ డతిప్రీతిం దదీయాంతికా
గతుఁడై వేఁడు వరంబు నీ వనిన నుద్గాడప్రమోదాత్ముఁడై.

215


క.

ధర జాఁగి మ్రొక్కి భక్తిం
గరములు ముకుళించి నుదుటఁ గదియించి శ్రుతి
స్ఫురితములగు సూక్తంబులఁ
బరువడి వినుతించి విన్నపం బొనరించెన్.

216


క.

వారిజదళలోచన నేఁ
బారము నొందంగ వేదపఠనము సేయం
గోరెద నవ్వర మొసఁగుము
కారుణ్యము నివ్వటిల్లఁగా నిపు డనినన్.

217