ఈ పుట అచ్చుదిద్దబడ్డది

228

పంచమాశ్వాసము


ఉ.

ఇచ్చటఁ బుష్పవర్షములు, నింపెసలారఁగఁ బాడుపాటలున్,
మెచ్చుల మ్రోయుతూర్యములు, మేదురనాదములున్, మనంబులం
జేచ్చెర నద్భుతం బొదవఁ జేసి, మహాత్మ యెఱుంగ మేము ము
న్నిచ్చట నిట్టిచోద్య మిదియెంతయుఁ దేటపడంగఁ జెప్పవే.

97


సీ.

నావుడుఁ బరమేష్ఠినందనుం డెలమి ని
ట్లను భరద్వాజుతో ననఘ! మున్ను
సుత్రామసఖుఁడైన చిత్రసేనుం డను
గంధర్వుఁ డతిశుభాకారుఁ డొకఁడు,
తరుణీసమేతుఁడై తనుఁజేరి యనుచరుల్
గొలువంగఁ దా నదీకూలమునను
గెందమ్మికొలఁకులఁ గ్రీడాద్రిసానుదే
శంబుల దరులనుఁ జఱులయందుఁ


తే.

గలయ విహరించి, యొకనాఁడు గగనవీథిఁ
జనుచు శ్రీరంగమందిరచ్ఛాయ దాఁట
నది గనుంగొని కనలి సప్తార్ణవములు
గడవవైచిరి తీర్థరక్షకులు వాని.

98


వ.

అత్తెఱం గెఱింగి తత్సఖుండైన శతమఖుండు చతుర్ముఖాదేశంబున
దత్పాపంబుఁ బాయు నుపాయం బాదేశించిన నా గంధర్వుండు సర్వ సర్వం
సహాచక్రంబున నేము నీ శరణ్యంబులగు నరణ్యంబుల పాపలతాలవిత్రంబు
లగు పుణ్యక్షేత్రంబుల ప్రపంచితపురుషార్థంబు లగుతీర్థంబుల నుపా
సించుచు వచ్చి వచ్చి యఖిలలోకంబులఁ బావనంబు గావించు ప్రఫుల్ల
పుష్కరామోదపుష్కరయగు పుష్కరిణి నవగాహనంబు సేసి
శుద్ధమానసుండై యతిమధురగానవిద్యావిశేషంబున శేషశాయిని
బరితోషితుం జేసి తత్ప్రసాదంబున భువనసంస్తుత్యంబగు గంధర్వా
ధిపత్యంబుఁ బడసె. నది మొదలుగా నతం డీతీర్థంబున సితపక్షపంచమి
దివసంబున సర్వకల్యాణచారణు లగునారాయణుల నారాధించుచుండు.
నేఁ డిట్టిదివసం బగుటఁ బూజాసముత్సుకంబున సపరిచ్చదుండై వచ్చు చిత్ర
సేనుకృత్యం బిదియని యెఱింగించినఁ బరమహర్షభరితుండై భరద్వాజుండు
వెండియు నిట్లనియె.

99