పుట:Shriimahaabhaarata-Shriimadraamaayana-Vimarsamu1907.pdf/80

ఈ పుట అచ్చుదిద్దబడ్డది

47

సర్వేశ్వరుడును, సృష్టికర్తయును, సర్వజ్ఞుఁడును గావున నేయే కార్యములను నీజన్మయందుఁగాని గతజన్మలయందుఁగాని చేసిన వారి కేయేఫలములు గలుగునో యది యెరుగుదురు. అట్టి కార్యాకార్యములఫలముల కొకచట్టము నేర్పరచి మనుజునకు స్వాతంత్ర్యము నిచ్చి సృష్టిచేసి యున్నారు. కావున వారి కేశంకయు గలుగుటకుఁ గారణము లేదు. సర్వజ్ఞుఁడు కాబట్టి యే భీష్మాదులు చచ్చుటకు సిద్ధముగ నున్నారు నీవు నిమిత్తమాత్ర మని చెప్పి యర్జునునకు మనఃకల్మషమునుఁ బోఁగొట్టిరి. ఇఁక ధర్మరాజువిషయము చూతము. ఇతఁడు ప్రతిజ్ఞను నెరవేర్చి తనరాజ్యభాగమును ధర్మయుక్తముగఁ గోరి యుద్ధముచేయ సమకట్టి యున్నాఁడు. ఇందుకుగా ననేకవీరులను రప్పించియున్నాఁడు. మరియు నుభయసేనలలో నెవ్వరివలన నెవ్వరు మడియుదురో తనకుఁ దెలియదు. అట్టివాని కీశంక గలుగుటకు గారణము లేదు. అర్జునుఁడు శ్రీస్వామివారివలె సర్వజ్ఞుఁడుగాఁడు. అయినను జ్ఞానము వివేకము గలవాడు. ఆకౌరవసేనలోని వీరులను జూచినపుడు భీష్మాదులనుఁ జంపుటకు దనకంటె మరియొకఁడు తమసేనలో లేఁడని యెరుగును. అట్టి వారలను జంపుటకుఁ గొంత సందేహించియుండిన నుండును. సమర్థుఁ డయినవాఁడే కార్యప్రారంభమునందు గీడుమేళ్లను గమనించుట సహజమైనపనియై యున్నది కదా?