పుట:Shriimahaabhaarata-Shriimadraamaayana-Vimarsamu1907.pdf/47

ఈ పుట అచ్చుదిద్దబడ్డది

14

    ట్టలముగఁ దమప్రాణములకు
    నలుగు జనులు పగతు రనుట యనుమానంబే"

ఆ. వె. "కారణంబులేక కౌంతేయులకు బాల్య
         మాది గాగఁ గీడె యాచరింతు
         పుణ్యపరులుఁ దోడఁబుట్టువు లార్యులు
         వైర మెత్తఁ దగునె వారితోడ."

మఱియు నీతఁడు శ్రీకృష్ణుల వారిమహిమను బూర్తిగ నెఱిఁగినవాఁడు. శూద్రుఁ డైనను విద్యాబుద్ధులు గలవాఁ డగుటచే నింతగౌరవమునకుఁ బాత్రుఁ డయ్యెను.

14. సంజయుడు.

ఇతఁడు కౌరవపక్షమున బాండవులయొద్దకు సంధిమాటలలో దూతగ వచ్చినవాఁడు. ఇతనియందు ధృతరాష్ట్రునకు గడుననురాగము గలదు. అతఁడు తనమనోవ్యధను నితనితోను జెప్పుట గలదు. ఆవృద్ధరాజునకు భారతయుద్ధకథ నితఁ డెఱింగించుచు వచ్చినటుల చెప్పఁబడి యున్నది. ఒక్కొక సేనాధిపతి హతుఁ డైనపిదప నతఁడు యుద్ధము చేసినదినములు కథను నాసేనాధిపతి మరణమును నొక్కసారిగఁ జెప్పినటుల నున్నది. ఏనాటియుద్ధకథ నానాఁటిరాత్రి యేల యతనితోఁ జెప్పకపోయెనో తెలియరాదు.