పుట:Shriimahaabhaarata-Shriimadraamaayana-Vimarsamu1907.pdf/27

ఈ పుట అచ్చుదిద్దబడ్డది

12

ఉపోద్ఘాతము.

ర్యునివైపు కల్పించినటులను, దానివలన సూర్యుఁ డస్తమించెనని తలఁచి తల యెత్తి చూచుచుండ నతనితల నర్జునుఁడు ఖండిచిన ట్లున్నది. ఈకథ యర్జునునకుఁ బ్రతిజ్ఞాభంగమైనదనియు, కౌరవవీరులు సైంధవుని జంపుటకు వీలులేనియట్లు కాపాడి రనియు నాధిక్యముకొరకుఁ జెప్పఁబడినది. కాని శ్రీస్వామివారు తిమిరమును గల్పించి మోసము చేసియుందురా! ఒకప్పుడు మేఘ మడ్డమై యుండుటయే నిజ మైనయెడల సాయంకాలసమయమున న ట్లుండుట తరుచుగ గలదు.

8. ద్రోణాచార్యునివధకొరకు ధర్మరాజుచేత శ్రీస్వామివా రబద్ధ మాడించినటుల నొకకథ గలదు. ఇదియు భీష్ముని శిబిరమునకు బ్రచ్ఛన్నముగఁ బోయి రనుకథవంటిదే. ఈ ముసలిబ్రాహ్మణుని చావుకొరకు శ్రీస్వామివారు మోసము చేయుట కబద్ధ మాడు మని నియమింతురా ! అస్త్రగురు చావునకు ధర్మరా జనృత మాడునా ? ఏమివింత ? అట్లు కానిచోఁ ద్రోణుఁడు యుద్ధమునందు మడియునా యను నతిశయోక్తి కొరకు గల్పింపఁబడినకథ గాని వేరు కాదు. యుద్ధానంతరము శ్రీకృష్ణులవారు తమద్వారకకుఁ బోయి వనుదేవునితోఁ జెప్పుటలో నీద్రోణుఁడు ముసలివాఁ డగుటచేత నలసిపోయి హతుఁడయ్యె నని యున్నది కాని ధర్మరా జబద్ధ మాడిన ప్రస్తావనయే లేదు.