పుట:Shrii-raamakrxshhna-suuktimuktaavali.pdf/300

ఈ పుట అచ్చుదిద్దబడ్డది

291

40వ అధ్యాయము.

833. దేవకీదేవికి చెఱలో శ్రీకృష్ణ దివ్యదర్శనప్రాప్తి లభించినను, అంతమాత్రాన ఆమెకు బంధనము విడిపోలేదు.

834. ఒక గ్రుడ్డివాడు గంగా పవిత్రజలములందు స్నానముచేయుటచేత, వానిపాపములన్నియు సమసిపోయెను; కాని గ్రుడ్డితనము విడిచిపోదయ్యెను.

835. భక్తునకు శారీరకముగా ఎటువంటిసుఖములు దుఃఖములు కలిగినను శ్రద్ధాభక్తిజ్ఞానముల మహాత్ఫలములు వానికి చెందకుండవు. ఆ విభవములు కుంటుపడవు. చూచితిరా, పాండవులకు ఎటువంటి ఘోరతరాపదలు వాటిలినవో! అయినను వారి సుజ్ఞానతేజము భంగపడలేదు.

836. "రోగము దానిపనిని అది చేయుగాక; శరీరము బాధపడుగాక. మనసా! నీవు నిత్యానందము తోడ నుండుము!"

837. భర్తతోడి కాపురము చేయుచును బ్రహ్మచర్యము నాచరించు స్త్రీ, సాక్షాత్తు జగజ్జనని స్వరూపమే!

838. నేను సర్వమును అంగీకరించెదను. జాగరము, స్వప్నము, సుషిప్తి, తురీయము, బ్రహ్మము, జీవుడు, ప్రకృతి అన్నియు అల పరమాత్మయొక్క వ్యక్తరూపములే. లేకున్నచో పరిపూర్ణత్వమునకు లోటువచ్చును. అందువలన నాకు ఖండాఖండ రూపములు రెండును సమ్మతములే.

839. ఒకానొక భక్తుడగు కట్టెల కొట్టువానికి దివ్యమాత ప్రసన్నమై కృపజూపినది; కాని కట్టెలు కొట్టువృత్తి మాత్రము వానికి తప్పలేదు. వెనుకటివలెనే కట్టెలకొట్టి అమ్ముచూ, స్వల్పజీవనము చేయుచుండెను.