పుట:Shrii-raamakrxshhna-suuktimuktaavali.pdf/223

ఈ పుట అచ్చుదిద్దబడ్డది

శ్రీరామకృష్ణ సూక్తిముక్తావళి

214

ఈశ్వరుని పావననామ సంకీర్తనము చేయుటచేత ఆనందింప జాలడు.

612. వడివడిగపాఱు జలప్రవాహము కొన్నికొన్నిచోట్ల గిరగిర సుడులు తిరుగుచు పోవును. కాని త్వరలోనె ఈస్థితిని దాటిపోయి తిన్నని త్రోవను వడిగ ప్రవహించును. అట్లే భక్తుని హృదయము తఱుచుగా నిరాశ, దుఃఖము, అవిశ్వాసము అను సుడుల చిక్కుచుండును; కాని యీస్థితి క్షణకాలపు వైపరీత్యమె; చిరకాలముండదు.

613. ప్రశ్న:- దుశ్చరితయగు స్త్రీ భక్తుని వెంటబడి వానిని తన దుర్వర్తనమునకు లోబఱచుకొనుటకు ప్రయత్నించిన ఏమగును?

ఉ:- పక్వమైయున్న మామిడిపండును గట్టిగా నొక్కినయెడల, దానిలోని టెంకయు గుజ్జును తప్పించుకొనిపోయి తోలుమాత్రమే చేతిలో మిగులుతీరున, భక్తునిహృదయము భగవంతునికడకు తప్పించుకొనిపోవును; మట్టి గుల్లయగు తనువు మాత్రమే ఆస్త్రీచేత చిక్కును.

614. మామిడిపండుతిని, ఎవరికైన తెలిసిపోవునేమోయని పెదవులను బాగుగ తుడుచుకొనువారు కొందఱుందురు. మఱికొందఱో తమకొకమామిడిపండు దొఱకగానే యితరులను కూడ కేకవేసిపిలిచి వారితో పండును పంచుకొనితిందురు! అట్లేకొందఱు బ్రహ్మానందముదొఱకగానె ఎవరికితెలియకుండ తామేఅనుభవింతురు. మఱికొందఱో తమ అనుభవమును ఇతరులకును కల్గింతురు.