ఈ పుట ఆమోదించబడ్డది

జదలెల్లఁ గనువిచ్చి సంభ్రమతఁ తిలకింప
నదులెల్లఁ మదిఁబొంగి నాట్యములు వెలయింప
వనకన్యలు సుమాభరణములు ధరియింప
వసుధయెల్లను జీవవంతమై బులకింప

        నాడెనమ్మా! శివుఁడు
        పాడెనమ్మా! భవుఁడు

అదిగదిగో! జలదకన్యక జూచు నేమిటో?
సదమలంబై నట్టి శంకరుని నాట్యమ్ము
నవిగో! మయూరమ్ము లాలపించు నదేమి?
శివుని తాండవకేళి శివకరము షడ్జమ్ము
చికిలిగొంతుకతోడఁ పికము గూయు నదేమి!
సకలేశ్వరుని శ్రుతి స్థాయికై పంచమము
వాయుపూరిత వేణువర్గ మే మందించు!
ఆ యభవు దాండవముకై తార షడ్జమ్ము

        నాడెనమ్మా! శివుఁడు
        పాడెనమ్మా! భవుఁడు

ఒకవైపు నర్థచంద్రకరంబు[1] బరగించి
యొకవైపు సూచీ[2] ముఖోద్వృత్తిఁ జూపించి
క్రీగంటితో నవ్వు క్రేళ్ళురుక వీక్షించి
మ్రాఁగన్ను వైచి తన్మయతఁ దా నటియించి

  1. పతాకమున నంగుష్ఠమును క్రిందకడ్డముగా జూచిన అర్ధచంద్రము.
  2. కటకాముఖమున జూపుడు వ్రేలు జూచిన మాచీహస్తము.