ఈ పుట ఆమోదించబడ్డది

పడగలెత్తును నాగుబాములై యొకసారి
ముడిచికొనుఁ గమలంపు మొగ్గలై యొకసారి
జ్ఞానముద్రికలఁ బక్షము లెత్తు నొకసారి
దీనదీనంబులైఁ దేలాడు నొకసారి
కటకాముఖంబులై[1] కనుపట్టు నొకసారి
పటు ముష్టి[2] బంధ సంపదఁ జూపు నొకసారి
శుకతుండ[3] హస్తమున శోభిల్లు నొకసారి
ప్రకట భ్రమరీసరళి[4] పరగించు నొకసారి
అటువైపు నిటువైపు నమల హస్తములూగి
అటమీఁద లిటఁగ్రింద నందములు జెల రేఁగి

        యాడెనమ్మా! శివుఁడు
        పాడెనమ్మా! భవుఁడు

కైలాస శిఖరములు కడఁగి ఫక్కున నవ్వ
నీలిమాకాశంబు నిటలంబుపై నిల్వ
నందికేశ్వర మృదంగధ్వానములు బొదలఁ
తుందిలాఽకూపార తోయపూరము దెరలఁ

  1. చూపుడు వ్రేలును, అనామికయు, బొటనవ్రేలితో మొగ్గవలె బట్టవలెను.
  2. నాలుగు వ్రేళ్ళను జేర్చి యరచేతిలోనికి వంచి యంగుష్ఠమును మిదజేర్చిన ముష్టిహస్తము.
  3. పతాకమున జూపుడు వ్రేలును, అనామికయు వంచిన శుకతుండము.
  4. నడిమి వ్రేలితో బొటనవ్రేలిని దాకి చూపుడు వ్రేలిని వంచి తక్కినవి జూచిన భ్రమరము.