ఈ పుట అచ్చుదిద్దబడ్డది

2


ముచేయుచున్నవి. అధికారప్రాపకముగల ద్రవిడప్రముఖుల పనుగడలను బ్రతిఘటించి యాంధ్రశిబిరములను స్థాపించి యాంధ్ర వ్యక్తితమును వ్యక్తముచేసిరి. ఈయాంధ్రత్వాభిమానము వారిగ్రంథములందును జీవితవిధానమునందును బ్రత్యక్షమగుచున్నది. ఈయభిమానము వలన సుబ్బారావుగారికి ప్రతికూలానుకూలపక్షము లేర్పడినవి. సుబ్బారావుగారి యాత్మగౌరవాభిమానము వారి జీవితమునందలి వ్యత్య స్తములకు గారణంబైనది."

ఆంధ్ర దేశమునందు సారస్వత జీవసము దురారాధ్యముగ నున్న్న ది. సరస్వతీ ప్రసన్నులకు లక్ష్మీప్రసన్న మపురూపముగ నున్నది. సరస్వతీదేవి నుపాసించుటకు గంకణమును గట్టుకొనినవారలకు లక్ష్మీకటాక్షము దుర్లభముగనున్నది. శ్రీమంతులను, రాజులను, మహారాజులను నాశ్రయింపకను సరస్వతీదేవి నుపాసించుట కవకాశములులేవు. పూర్వ యుగములం దట్టి సేవ కవకాశములుండినను భౌతికాడంబరమయమైన కలియుగమునందు బొత్తిగా నవకాశములులేవు. ఈ కారణమువలననే సుబ్బారావుగారివంటి భాషాసేవకులకు సారస్వతజీవనము దుర్లభమై అకాలమృత్యువు సంప్రాప్తమైనది. సుబ్బారావుగారు పిఠాపురమునందును జెన్నపురియందును జీవయాత్రను గడుపుచున్నపుడు వారికిగలిగిన యసంతృప్తి వారియకాలమరణమునకు మూలము. పిఠాపురమునందు బ్రతిభావంతులైన శ్రీయుతపానుగంటిలక్ష్మీనరసింహము పంతులుగారికి బ్రియశిష్యులై రచనా కౌశలమును బడసిరి. శ్రీయుత చెలికాని లచ్చారావుగారి యాదరణపోషణముల క్రింద నాంధ్రపరిశోధక మహామండలిని స్థాపించి దానినిర్వహణమునం దపారమైనశక్తిని గనుపరచిరి. ఆంధ్ర పరిశోధకమండలియందు లభించిన యనుభవము వేమన, యాంధ్రవాఙ్మయచరిత్రము, శతకకవులచరిత్రము మొదలగురచనలకు దోడ్పడినది.