పుట:Shathaka-Kavula-Charitramu.pdf/126

ఈ పుట అచ్చుదిద్దబడ్డది

బద్దెన.

43


మధురము లనుటకంటె నధికముగఁ జెప్పవలసినది లేదు. పద్యము తేట తెల్లముగ నుండి, వేమనపద్యములవలె, నరఁటిపండువలె విడిపోయి, పండితపామరజనైక వేద్యముగ నుండును.

ఇట్టి మహాశతకమునందును స్వల్పముగ దోషములు కనఁబడు చున్నవి.

(1) అనవసరపదములు.

“గట్టిగ ద్రవ్యంబు గలుగఁ గదరా సుమతీ!” 44

మిక్కిలి బిగువుగ నుండు సుమతిశతకములో నొక్కపదమైనఁ దీయుటకు వీలుండదు. అట్టియెడ నొకటిరెండునెఱసు లుండిన నవి లేఖకదోషములై యుండనోపును.

(2) వ్యాకరణదోషములు.

"నారే నరులకు రత్నము”. 65

"మెచ్చునదె నేర్పు వాదుకు”

నారియే యనఁగా వనితయే యని కవియభిప్రాయము. ఇట్టివి ప్రౌఢప్రయోగములుగ స్వీకరింపవలసినది లేనిది భాషాతత్త్వవేత్తలు నిర్ణయించెదరుగాక !

శతకమునందుఁ గవి చాలచోట్ల వేశ్యలను, స్త్రీలను గర్హించి యున్నాఁడు. వేశ్యాగర్హణ మేకాలమునందును గోరఁదగినదే కాని, “కులకాంతపై వట్టితప్పు ఘటియించిన సిరియుండ” దని మనల భయపెట్టినయీతఁడే స్త్రీలను నమ్మరాదని, స్త్రీలకు రహస్యములు చెప్పవలదని, కోమలికి విశ్వాసము సున్న యని చెప్పినమాటలు నవనాగరకులకుఁ గష్టముగ నుండునని తోఁచుచున్నది. ఇందలి సంసారానుభవములు, బందుగులు, మిత్రులు, రాజులు, మంత్రులు, రసికులు, వీరికి సంబంధించి చెప్పిన విషయములు కవిలోకానుభవమును, దూరదృష్టిని మనకు వెల్లడించి కవి ప్రతిభాశాలియని తోఁపింపఁ జేయుచున్నవి.

ఈకవి కొన్ని పద్యములు కేవలము సంస్కృతశ్లోకముల ననుసరించి వ్రాసియున్నాఁడు. ఒండురెం డుదాహారణముల నిచ్చెదను.