పుట:Shathaka-Kavula-Charitramu.pdf/122

ఈ పుట అచ్చుదిద్దబడ్డది

బద్దెన.

39


ఇట్టినియమము శతకవాఙ్మయ మభివృద్ధి యైనసిమ్మటనైనఁ గావచ్చును. ప్రారంభమున నిందున్ననియమ మెఱుఁగక తరువాతవారు విడిచియుండవచ్చును. ఇట్టినియమము కనఁబడుచున్న భాస్కర, వేణుగోపాలశతకములు 15వ శతాబ్దమునకుఁ బూర్వపువైనట్లు తోఁచదు. కావున నీ నియమమువలననే యిది ప్రాచీనశతక మనుటకు వీలులేదు. ప్రాచీనపద్యములవలె నిందు ప్రాసలోఁగూడ నఱసున్న పాటించి యున్నపద్యము లగుపడుచున్నవి. కావున నీ రెండు నియమములవలన నిదిప్రాచీనశతక మైనఁ గావచ్చును. ఇందాధునిక మని చెప్పుటకు వీలైనపదజాలము లేక పోవుటకూడ దీని ప్రాచీనతకే సాయపడుచున్నది.

(2) ఇందు పెక్కుచోట్ల "ఒక యూరికి నొక కరణము” (22) “కరణము కరణము సమ్మిన" (29) "కరణము సాదైయున్నను.” (31) అని కరణము పదము చాలమారు లుపయోగించినాఁడు. “కరణము” సంస్కృతశబ్దము. కరణీకములు, కరణములు నెప్పటినుండి యుండెడివారో తెలియుసాధనము లున్నచో నీశతక మప్పటికిఁ బిమ్మటి దనవచ్చును. ప్రాచీనప్రబంధములలో “గణకవిద్య” యని కరణీకమును గూర్చి కాఁబోలు మంత్రికులము వారినిఁగూర్చి వ్రాసినట్లు కొన్నినిదర్శనములు చూపవచ్చును. కాని గణకుని కరణ మనిపిలుచుట యెప్పు డారంభమయ్యెనో తెలియదు. ఈ శతకమునందే మఱియొకచోట నీక్రింది పద్యమున్నది.

క. నరపతులు మేరఁ దప్పిన | దిరమొప్పఁగ విధవయింటఁ దీర్పరి యైన౯ !
   గరణము వైదికుఁడైనను | మరణాంతక మానుగాని మానదు సుమతీ. 62

ఇట్లు వైదికుఁడు కరణ మైన మరణాంతక మగు ననుటయు, చాలపద్యములలో “కరణములను" పొగడుటయు “మంత్రి లేనిమండలాధిపతి తొండములేని యేనుఁగువంటివాఁ”డని (84) యు, "కాఁపు ------- మయిన కరణాలకు బ్రతుకు లే” దని (81)యు "మంత్రి గల వాని రాజ్యము తంత్రము సెడకుండ నిలుచు"(85) ననియు, నియోగు