పుట:Shathaka-Kavula-Charitramu.pdf/102

ఈ పుట అచ్చుదిద్దబడ్డది

పాలుకురికి సోమనాథుఁడు.

21


న్నవాఁడు. మిక్కిలిమేధావంతుఁడై యనేకశిష్యప్రశిష్యపరివృతుఁడై యుండువాఁడు. ద్వైతాద్వైత సిద్ధాంతములఁజర్చించుటలోమంచి ప్రవేశము కలవాఁడు. ఈవిశేషణము లన్నియుఁ బిడుపర్తి సోమనాథుఁడు వ్రాసినబసవపురాణ, చంపూకావ్యము నందలియాశ్వాసాంతపద్యములఁ జదివినవారి కతిశయోక్తులు కావని తెలియఁగలదు. బసవన్న చారిత్రకయుగము నందలి మహావీరుఁడు. ఆతనిచారిత్రమునకు దివ్య తేజస్సు కల్పించి సోమనాథుఁడు వీరపురుషా రాధన మునర్చి వీర శైవమతమును బ్రజ్వలింపఁజేసి మతముతో దేశ, దేవభక్తులఁ గలిపిన గొప్పరాజకీయ పరిజ్ఞాతయనియు, మహాపురుషుఁ డనియుఁ జెప్పవచ్చును. ఆతనిమతసిద్ధాంతములప్పటి దేశ, రాజకీయములననుసరించియు, జైనమతప్రాబల్యానుసారముగను, అతనిబుద్దికిఁ దోఁచినట్లు సంస్కరణముల గోరి, ప్రజలయం దాభావములు వ్యాప్తి నొందుటకు వలసిన వాఙ్మయమును దాటియాకులపై వ్రాసి, స్వయముగఁ జదివి, శిష్యులఁ బ్రోగుచేసి, రాజులను, మంత్రులను స్వాధీనము చేసికొని, దేశసంచార మొనరించి, యన్యభాషలనేర్చి, యందుఁ గావ్యములల్లి, వీర శైవముచే దేశము నుద్దరింపఁ, దల పెట్టినగొప్పనాయకుఁడు. యతీశ్వర్యుడై సర్వసుఖముల వర్జించి పాలుకురికి సోమనాథుఁ డొనర్చినపని యనన్యసామాన్యము. దాని మంచిచెడ్డలు, ఫలితమును విమర్శించుపని దేశీయచరిత్రకారునిది. కావున దేశజులు మనసోమనాథుని కవిగనేకాక యింక ననేకవిధములఁ బూజింపవలసినట్లు తోఁచక మానదు.

ఇతనిచరిత్ర మింకనుదెలియఁగోరువారి కనువుగ చంపూబసవపురాణము , కృతి నిచ్చుచు పిడుపర్తిసోమనాథుఁడు వ్రాసినయీతనిచరిత్రము. చదువుకొనుఁడు.

వీరశైవులలో నీతని దైవమువలె నారాధింతురు. ఈతనిద్విపదకావ్యములలోని మతాభిప్రాయముల నటుంచి చూచిన నీతఁడు వాడినశబ్దజాలము, శైలీప్రవాహము, వాడుకభాషా నిరంకుశత్వమును భాషాభిమానులు వేనోళ్లఁ బొగడుచుందురు.