ఈ పుట అచ్చుదిద్దబడ్డది

పరిచయము

పొన్నూరు సంస్కృత కళాశాలాంధ్రోపన్యాసకులగు కవిరాజు శ్రీ కొండవీటి వేంకటకవిగారు ప్రచురించిన శ్రీమత్పరవస్తు చిన్నయసూరి విరచితంబగు "శబ్దలక్షణ సంగ్రహము" అను నీగ్రంథమును సాకల్యముగాఁ బరిశీలించితిని.

ఆంద్రము వ్యావహారిక భాషామిశ్రితమై యడుగంటుచున్న కాలమున శ్రీ పరవస్తు చిన్నయసూరిగారు బయలుదేఱి ప్రాచీనాంధ్రమును నెలకొల్పిరి. వారు మొదట సంస్కృత సూత్రమయ సూత్రాంధ్ర వ్యాకరణము నాంధ్ర సూత్రరూపమగు నీ శబ్దలక్షణ సంగ్రహము మొదలగు గ్రంధములను రచించి వానిని సంస్కరించి తుదికి బాలవ్యాకరణమును బ్రచురించిరని తోఁచెడిని.

ఈ శబ్దలక్షణ సంగ్రహము శ్రీ చిన్నయసూరిగారిచే విరచితముకాదని విద్వాన్ బ్రహ్మశ్రీ కఱ్ఱిసాంబమూర్తి శాస్త్రిగారు స్వరచితాంధ్ర ధాతుమాలాపీఠికలో వ్రాసిరి. కాని యా విషయమును స్థిరపఱుచు వారి యుక్తులు వినలేదు.

ఆంధ్ర ధాతుమాల, శబ్దలక్షణ సంగ్రహములే కాక పెక్కు గ్రంథములు శ్రీ చిన్నయసూరిగారు రచించినట్లు వాడుక గలదని యాంధ్ర ధాతుమాలా పీఠికలో నొక పట్టిక గలదు. అందుఁగొన్నిమాత్రమే శ్రీ పరిషత్తువారిచే ముద్రితము లయ్యెను. ఈ శబ్దలక్షణ సంగ్రహమును బ్రచురించి వేంకటకవిగా రాంధ్రలోకము కృతజ్ఞతకుఁ బాత్రులగుచున్నారు,