ఈ పుట ఆమోదించబడ్డది

18

సౌందర్యలహరి


నెవఁడు ధ్యానించునో యాయుపాసకప్రవరుఁ డెల్లపల్లవాధరలను భ్రమపెట్టు నననేల? ముల్లోకముల నొక్కపెట్టున మోహింపఁజేయఁగలఁడు. సూర్యచంద్రులు స్తనము లనుటచేత స్త్రీయని ధ్వని.

    కిరన్తీమఙ్గేభ్యః కిరణనికురుమ్బామృతరసం
    హృది త్వామాధత్తే హిమకరశిలామూర్తిమివ యః,
    స సర్పాణాం దర్పం శమయతి శకున్తాధిప ఇవ
    జ్వరప్లుష్టాన్ దృష్ట్యా సుఖయతి సుధాధారసిరయా. 20

టీ. హేదేవి = ఓతల్లీ, యః = ఎవఁడు, అఙ్గేభ్యః = అవయవములవలన, కిరణనికురుమ్బామృతరసమ్-కిరణ = కాంతులయొక్క, నికురుమ్బ = సమూహమువలనఁ గలిగిన, అమృతరసం = అమృతద్రవమును, కిరస్తిం = కురియుచున్న, హిమకరశిలామూర్తిమివ = చంద్రకాంతమణివలె, హృది = నెమ్మనమున, త్వాం = నిన్ను, ఆధత్తే = నిలుపుచున్నాఁడో, సః = వాఁడు, శకున్తాధిపఇవ = పులుఁగులఱేఁడగు గరుడునివలె, సర్పాణాం = చిలువలయొక్క, దర్పం = పొగరును, శమయతి = మాపుచున్నాఁడు, సుధాధారసిరయా = అమృతనాడియగు, దృష్ట్యా = చూపుచేత, జ్వరప్లుష్టాన్ = జ్వరముచేఁ గ్రాఁగినవారలను, సుఖయతి = సుఖింపఁజేయుచున్నాఁడు.

తా. తల్లీ, సర్వావయవములచే నమృతమును గురియుచున్ననిన్ను చంద్రకాంతమణివలె హృదయమున ధ్యానించువాఁడు సర్పములను గరుడునివలె రూపుమాపును. ఒక్కసారి చూచినంతమాత్రమున నెట్టి జ్వరపీడితుల సంతాపమును బోఁగొట్టఁగలఁడు.

    తటిల్లేఖాతన్వీం తపనశశివైశ్వానరమయీం
    నిషణ్ణాం షణ్ణామప్యుపరి కమలానాం తవ కలామ్,
    మహాపద్మాటవ్యాం మృదితమలమాయేన మనసా
    మహాన్తః పశ్యన్తో దధతి పరమానన్దలహరీమ్. 21