ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ఓసీ! నీకు మాసొమ్మెంత విషమైనదే! ఈ తీరుగా బనికొడలు దాఁచుకొని యింటికే ముఖము పెట్టుకొని తిండికి రావలయు ననుకొన్నావు?

చంద్ర - అమ్మా, కోపింపకుము. నేను మీ యానల శిరసావహించియే పని చేయుచున్నాను. నేఁడు నా దురదృష్టము పండి దర్భలకై యడవికేగిన నా కొడుకును బాము కఱచినదఁట.

కాలకం - ఓసీ, సూత్రధారీ! తొందరగా నెందుకుఁ బనిచేయవన్నందునకీ పన్నాగము పన్నినావు! ఛీ! ఛీ!

చంద్ర - అమ్మా! నే నబద్ధ మెన్నటికి నాడనమ్మా! దర్భలకై పుట్టనెక్కగా నా కొడుకును బాము పట్టెనఁట.

కాలకం - ఎవరు చెప్పిరి?

చంద్ర - వెంటబోయిన వడుగులు చెప్పిరి.

కాలకం - అయ్యో! మాకు ధనవ్యయంబు గలిగింప నీవెక్కడ దాపురించితివే? బోలెడు ధనముపోసి కొనిన మేము నీ జీవనమునకు దేవుడాయని యేడ్వవలసి యుండఁగా నీకెందులకే యీ యేడుపు?

చంద్ర - అమ్మా! కన్నకడుపుగదా?

కాలకం - అట్లయిన నిప్పుడేమి చేయమందువు?

చంద్ర - కుఱ్ఱవాడు పడియున్న చోటకేగి చూచి వచ్చెదను. సెలవీయవలయును.

కాలకం - ఓసీ, నిర్భాగ్యురాలా! ఇంటిలో జేయవలసినఁ బనులెన్నియో ముందుఁ బెట్టుకొని యెక్కడకో పోయెదననుటకు నోరెట్లాడెనే? నీవు పోయిన తరువాత నీ పని యంతయు నీ తాత యెవరు చేయును? ఊఱక నోరుమూసుకొని నా వెంట రమ్ము.

చంద్ర - తల్లీ, కాలకంటకీ!

మ. కడ ప్రాణంబున నున్నవాఁడొ, విసమెక్కన్‌ జచ్చెనో కానలోఁ
గొడుకమ్మా! ననుఁ బంపకుండినను యోగ్యుండైన వైద్యుం ద్వరం
బడి యచ్చోటికిఁ బంపుమమ్మ బ్రతికింపం జాలునేమో సుతున్‌
గడ కాళ్ళంటి నమస్కరింతు సుతభిక్షం బెట్టి రక్షింపుమా.

కాలకం - చాలు చాలిదివఱకుఁ దిన్నది చాలక మాసొమ్మింకను గుండము వేయుదువుగా! దర్భలకు పోయినవాడు పుట్టలెక్కుట యెందులకు? పాము నోటికి గాలందీయఁగాఁ గఱవక ముద్దు పెట్టు కొనునా! కఱవకుండునట్లు దేశములోని పాముల కన్నింటికి వాకట్టు కట్టకుండుట మాతప్పాయేమి? నీ కొఱకై వైద్యునెవ్వరి నిక్కడ సిద్ధముగా నుంచలేదు. మాకు మందులు చేతఁగావు.