ఈ పుట ఆమోదించబడ్డది

కాలకౌ: ఏమోరా నాయనా! నీవు మాత్రము మాముండతో నామీద గొండెములు చెప్పకేమి. (ఇల్లు చేరుదురు)

కాలకం: వచ్చుచున్నావూ? రా, రా. (సమీపించును)

చంద్ర: (స్వగతము) అకటకటా! ఏమీ ధూర్తయైన యీ విప్రాంగన వర్తనము! ఈవిడయే నా యజమానురాలు గాబోలు.

కాలకం: దుర్మార్గుడా! నీ విల్లు వదలి యెంతసేపయినది? నీ కొఱకై పొయ్యార్పుకొని నేను గనిపెట్టుకొని యుండవలసినదా? ఈమధ్య నీకు బొత్తిగాఁ బ్రాయశ్చిత్త కర్మములు లేకుండ నున్నవి. నేఁడు నీకు మూఁడినది గానీ చెప్పు.

 	(కీర్తన: ఫరజు - త్రిశ్రగతి)

ఇంత పొద్దెక్కినదాక నీ వెక్కడ నుంటివి ఇంటికి రాక ॥ఇం॥

కాలకౌ: యాయవార మెత్తినాఁడ సంతపోయి శవాలను మోసికొచ్చినాఁడ ॥యా॥

కలకం: తెచ్చిన డబ్బేదో తెమ్ము నీ మ్రుచ్చుపోకిళ్ళను మెచ్చ రారమ్ము

కాలకౌ: మూడెమాడలం దెచ్చి నాడ నీతోడు నాకింకను దొరకలేదేవాడ

కాలకం: అట్లైన నే నూరుకోను నీపొట్ట బద్దలుచేసి నెట్టివేయకపోను (కొట్టుచున్నది)

కాలకౌ: అబ్బబ్బ నే నోర్వలేను యీ డబ్బునకు రేప యిబ్బడి ఈడ్చెదనే

కాలకం: నీ వింక జాగరూకతతో మెలంగకున్న నీగతి యింతియే.

కేశ: అమ్మా! కాలకంటకి నే డప్పుడే వదలి పెట్టినావే? ఇక్కడ చూడు. (చంద్రమతిని, లోహితాస్యుని చూపించును)

కాలకౌ: ఓరీ, కేశవా! నీ పుణ్యము, నీ వూరుకోరా! (గడ్డముఁ బట్టి బ్రతిమాలును)

కాలకం: ఇఁక నేనూరుకోను. ఈ నిర్భాగ్యురాలెవరు? చెప్పు. (కొట్టును)

కాలకౌ: (గట్టిఁగాఁ జేతులు పట్టుకొనుచు) నీకడుపుకడ, ఇంక చంపకే!

కాలకం: ఓరీ నీ చేతులు కాలిపోను! నీశక్తి మండిపోను! ముసలితనము వచ్చినను నీ కెంత మదమున్నదిరా! ఓ యెవరయ్య! నన్ను నామగఁడు చంపుచున్నాఁడు. రండయ్యా! (కేకలు వేయుచున్నది)

కాలకౌ: (నోరుమూయుచు) ఓసీ, నీపుణ్యము. అఱవకే. సుకుమారివి, నీ వింటిలోఁ బనిచేసుకోలేవని దాసిని దెచ్చినాడను.