ఈ పుట ఆమోదించబడ్డది

బుద్ధిమతీ విలాసము

(గ్రంథకర్త: - బలిజేపల్లి లక్ష్మీకాంతకవిగారు)

విష్ణుభక్తులలో బాలభక్తుడై విఖ్యాతినందిన ప్రహ్లాదుని వలెనే శివభక్తులలో బాలభక్తుడైన జగద్విఖ్యాతిమంతుడు మతిమంతుడు ! మతిమంతుడు పదియేండ్ల బాల్యమునందే పటుతర శివభక్తి స్థిరత్వమును ప్రకటించినాడు. ' నిన్ను నీ తండ్రి దయారహితుడై చంపి యొక సన్యాసికి భోజనముగా నిడనున్నాడు. పారిపొమ్మని తనకు నీతి బోధ జేసిన భృంగికి వైరాగ్యములు బోధించినాడు. తన యకాలమరణము నకై తల్లడిల్లు తలిదండ్రుల నోదార్చి నిర్భీతితో మృత్యువు నెదిర్చి నిలిచినాడు. యతిరూపమును దాల్చి మతిమంతుని తలిదంద్రులగు బుద్ధిమతీ సిరియాళ రాజేంద్రులను శోధించిన శ్రీ సదాశివుని యార్భాట మత్యంత భయానకము. కథానాయిక యగు బుద్ధిమతీదేవి యొక్క పాతివ్రత్యము సతీమణుల కాదర్శప్రాయమయి యున్నది. కథానాయకుడగు సిరియాళ రాజేంద్రుని నిత్య సత్యసంధత - శివభక్తి - అతిథిసత్కార దీక్ష - వైరాగ్య ప్రవృత్తి - సమస్త భూలోక మానవులకు అవశ్యానుసరణీయములు. బుద్ధిమతీదేవి గర్భవాసమున నవమాసములు మోసి కనిన వంశైక ప్రదీపకు డగు నేకపుత్రుని, ఒక యతినాథునకు - బాలక మాంసాకాంక్షి యగు నొక సన్యాసికి బలిగా నిచ్చుటకు రవంతయైన వెనుదీయని మహాసాధ్వీమతల్లి, భర్త యభిమతమే తన యభిమతముగా నెంచి యతిథి పూజచేసిన యతిలోకవిఖ్యాత యగు పతివ్రతా శిరోరత్నము. బుద్ధిమతీ సిరియాళ మహారాజుల యొక్కయు, మతిమంతుని యొక్కయు శివభక్తికిని - అతిథిపూజా పరతంత్రతకును మెచ్చి పార్వతీపరమేశ్వరులు నిజరూపములతో సాక్షాత్కరించి, వరప్రదానము గావించిన భక్తిరస పూరితమగు దివ్యచరిత్రము. అమృతము లొలుకు పద్యములు. అద్భుతములగు గద్యములు, ఆంధ్రరంగస్థలములం దనేకమారులు ప్రదర్శింపబడి, లోకాతీత సత్కీర్తి గాంచిన నాటకరాజము. వెల రు. 1-0-0


వలయువారు: - సరస్వతీ బుక్ డిపో, బెజవాడ.