ఈ పుట ఆమోదించబడ్డది

తప్పదు గదా! ఇదిగో, ఖండితులైన యపరాధుల రక్త పంకముచే నెఱ్రనై యున్న యీ వధ్యశిల నీ వింక నారోహింపుము. కులకాంతను నిన్నొక్కనికి విక్రయించిన యీ కృతఘ్నునకు స్త్రీ హత్యా పాతకము గూడ రాఁదగ్గదే!

చంద్ర - (వధ్యశిల నారోహించి) నాథా! మీరింక నాకై చింతింపకుడు. మీ రెఱుగని ధర్మము లేదు గదా! నన్ను జంపుట వలన సంభవింపగల పాపము నిరపరాధుల శిక్షించు నీ కాశికాపురాధీశ్వరు జెందుగాని మిమ్మంట నేరదు. అదిగాక, రాచబిడ్డను జంపితినను నీచమైన నిందను మోసిన నేనింక బ్రతికి మాత్రమేమి ప్రయోజనము. ఎక్కడనో నీచపు జావు చావకుండగా జీవితేశ్వరులగు మీ చేతనే చావఁ గలిగినందులకు నేను బూజ్యురాలనే. మీరింక నిష్కళంకచిత్తమున మీ సత్యనిరూఢి వేల్పులెల్లం బ్రశంసింప నా తలద్రుంచి మీ స్వామి యాజ్ఞ నెఱ వేర్పుడు. ప్రాణపతీ! నా కడసారి వందనమందుకొనుడు.

హరి - హా! హా!దుర్భరము దేవీ! నీవెంత చెప్పినను నాకూఱట జనించుటెట్లు?

సీ. నీవేకదా నాకు నిఖిలేప్సితంబుల
          నవగతంబు లొనర్చు కల్పలతవు
నీవుగదా నాకు నిత్యసత్యయశంబు
          దరిచేర్చుచుండెడు ధైర్యలక్ష్మి
నీవెకదా ఘోర దావానలమునుండి
          మమ్ము రక్షించిన మానవతివి
నీవె గదా మౌని ఋణబాధఁ దొలఁగించి
          పరువు నిల్పిన యట్టి భవ్యమతివి

గీ. నీవెకా నానిధానంబ నీవెకావె
          నాకులవిభీషణంబవు నీవెకావె
        అమరునే నాకు వేయి జన్మములకైన
         నిన్ను వంటి సతీమణి నెలఁతమిన్న?

చంద్ర - నాథా! దుఃఖం బుపశమింపుడు.

హరి - ఇదిగో! నేను దుఃఖము విడిచిపెట్టినాఁడను.

గీ. మానినీమణి! గతమెల్ల మఱచిపొమ్ము
పదిలపఱుపు మేకాగ్రత హృదయవృత్తి