ఈ పుట ఆమోదించబడ్డది

 
ఱందగునా? సతీ కనికరమ్మున కింత యెడమ్ము లేదు మా
డం దొర కీక యిప్పు డిచటన్‌ జితిఁ బేర్చుట కేను గర్తనే?

కావున నెట్లయిన మీ దొరసాని నడిగి మా స్వామికీయవలసిన మాడయుం బాతయు సంపాదించుకొనిరమ్ము. ఇప్పుడు నా చేతనైన సహాయము నాకిందురావలసిన పిండాశనము మానుకొనుట దక్క వేఱొండులేదు.

చంద్ర - హా! విధీ! యెంతవాని కెంతటి దురవస్థం దెచ్చి పెట్టితిని? నాథాఁ! యిట్టి యిక్కట్టులందును మీరు ధర్మపథంబు దొలగనందులకు నాకు సంతసమే కలుగుచున్నది. నేను మాదొరసాని కడ కేగి మాడయుఁ బాఁతయు నడిగెదను. ఆవిడకా కాసంత దయగూడఁ గలుగకున్న విధి యెట్లు విధించెనో యట్లగుఁ గాక!

హరి - శీఘ్రముగఁ బొమ్ము. అంతదనుక. గుఱ్ఱవాని కళేబరము నేఁ జూచు చుండెద.

(చంద్రమతి నిష్క్రమించును)

హరి - (కుమారుని ముందుంచుకొని) హా! హా! ఎంతఘోరము సంభవించినది? కొడుకా, లోహితా!

 
మ. చతురంబోధి పరీత భూతధరిణీ సామ్రాజ్యసర్వస్వ సం
తత ధౌరేయుండవయ్యు నీ వొకని యింటం గూటికై బంటవై
యతి నైచ్యంబు వహించి దిక్కు సెడి యిట్లైనాడ వేమందు నీ
బ్రతుకీ నాటికి తెల్లవారె గద పుత్రా యిన్ని బన్నాలతోన్‌.

తండ్రీ! నీ ప్రాణమునకా కాలసర్పమెక్కడ దాపురించెను? నిన్నుఁ గన్న తల్లిదండ్రులెన్నో దుఃఖంబు లనుభవింప రాళ్ళవలె బ్రతికియుండ నీవు దిక్కులేక యేకాకివై తుదకిట్లు దుర్మరణంబు పాలైతివే?

 
శా. నిన్నా పన్నగ ముగ్రతం గఱవ దండ్రిం దల్లిన్‌ జీరియే
మన్నావో యపుడెంత బాధపడితో హా! పుత్రకా! నాకునై
యెన్నో బన్నములందినావు తుదకిట్లేకాకివై పోవ నేఁ
గన్నారం గననైతి నీ యెడఁ గృతఘృత్వంబు పాటించితిన్‌.

ఇంక దుఃఖించి యేమి ప్రయోజనము. నీవు దీర్ఘాయుష్మతుఁడ వగుదువని నుడివిన కాలజ్ఞుల పల్కులే నిక్కంబు లగునేని నీకిన్ని కష్టములు రాకుండు. కాటిపన్నునకై పోయిన దేవి యింకను రాకున్నదేమి? దెల్లవాఱినదే? ఏమా కలకలము?

(తెఱలోఁ గలకలము) ఓహో పురజనులారా! మన రాజుగారి యింట దొంగతనముచేసి ధనాశచే రాచబిడ్డం జంపిన యీ శిశుహంత్రిని దలఁగోయ వలసినదిగా రాజాజ్ఞయైనది కనుక దీనిని వధ్యశిల యొద్దకు దీసిగొని పోవుచున్నాము.