ఈ పుట ఆమోదించబడ్డది

చంద్ర - అయ్యా! ఇప్పుడు గూడ నెంత పరాభవము జరుగుచున్నది. హా ప్రాణపతీ! ఇట్టి యవస్థయందు నీవు సహాయపడుటకు నా యండ నుండ వైతివే!

హరి - (స్వగతము) ఏమి? పతివిదూరయా? ఎవతెయో కాని,

గీ. ఈ నెలంత సుశీలగాఁ గానిపించుఁ గారణాంతరమున నిట్టి కష్టదశను జెందినట్లున్న దదికాక ముందు నేను విన్నదియుఁ గానే యున్నది వెలది స్వరము.

అయినను విచారించిన దప్పేమి? (ప్రకాశముగా)

మ. పడతీ యెవ్వతెవీవు? ఱాలుగరగన్‌ వాపోవుచున్నావు నీ కొడు కెద్దాన గతించె? నెవ్వరున్‌ నీకుం జుట్టముల్‌ లేరే యీ నడిరే యొంటిగ నెట్లు వచ్చితి శ్మశాన క్షోణికిన్‌? జిత్ర మ య్యెడు నీరీతి వచింపు మేడ్చి ఫలమేమీ! యూఱటం బొందుమీ.

చంద్ర - (స్వగతము)

గీ. అరయ నితఁడొక మహనీయుఁ డట్లు తోఁచు నీతని వచోవిధం బెన్న నేమొ కాని పరిపరివిధంబులను బాఱు హృదయవృత్తి యింత దుఃఖంబునన్‌ గొంత శాంతి వొడము.

ఏమైనను నిప్పుడు మౌనము వహించిన గార్యము నెఱవేఱదు కాన నిట్లు మాట్లాడెదను.

చ. పురుషవరేణ్య! నీ వెవఁడవో యెఱుఁగన్‌ మసనంబు లోపలన్‌ దిరిగెడు భూతనాధుడవొ దీనదశాకలనన్‌ గృశించు నన్‌ గరుణ ననుగ్రహించుటకుఁ గా నరుదెంచిన సిద్ధమూర్తివో పరమదయాబ్ధి నే నవని పైఁ గొఱగాని యభాగ్య దేవతన్‌.

హరి - మానినీ! నే సిద్ధుండ గాను, భూతేశుండఁ గాను. ఈ వల్లకాటికిం గావలి గాయువాఁడను. కాని సాహసము చేసి యీ యర్ధరాత్రమునఁ దోడులేక యిక్కాటికెట్లు వచ్చితివి? నీ చరిత్రయేమో యెఱింగింపుము. వచ్చిన కష్టము లనుభవింపక తీఱదు కదా!

చంద్ర - మ. అనఘా! ఎంతని విన్నవింపగలనయ్యా! రోళ్ళరోకళ్లదా బాడిన నాదీన చరిత్ర మెల్ల నొకపాడిన్‌ జేసి యీ దేహమొ