పుట:Saripadani Sangatulu by Bellary Raghava.pdf/57

ఈ పుట అచ్చుదిద్దబడ్డది

మూడవ రంగము

లీల:-యోచింపుడు. చక్కగా యోచింపుడు. సమాజపుభీతిచే న్యాయమార్గమును తప్పకుడు. పాండవ ధీరుడగు భీమసేనుడు భీతియనునది కలయందైనను ఎరుగడు. నాభర్త సార్ధకనామ ధేయుడైనప్పుడుగదా నాకు సంతొషము గలుగును! తారవిషయము, మన రాజావిషయము, మీకిది వఱకే తెలిసి యుండవచ్చును. తప్పుచేసినవాడు నీకుమారుడేగదా! వానితండ్రియగు మీరు, ఆతప్పుకై అమాయకురాలగు మేనకోడలిని చిత్రవిధిగా శిక్షించుటకన్న, అది తప్పులోని పొరపాటును తొలగించి, తప్పును ఒప్పుగా మార్చుట శ్రేస్టతమము గదా! నరకద్వారము నుండి మరలించి తమకు పుణ్యఫలము సమకూర్చుననికదా పుత్రునిబడయుట, అట్టివానిని మీరే నరకమున బడద్రోయ జూచెదరా? దయయుంచి తార మూలకముగా రాజును తరింపజేయుడు. చిత్రహింసాసహనమైన ప్రకృతి సమాజపు కట్టుబాట్లను త్రెంపివైచి, కీర్తినిగనుడు. అదియే ధీరపురుష లక్షణము . ఇంతకన్న నేనెక్కువ చెప్పజాలను. (అని నిష్క్రమించును)

(భీమసేస రావు గారు పచారు చేయుచుండును. విద్యాలంకాచార్యులు ప్రవేశింతురు. భీమసేనరావు నమస్కరించును.

ఆచార్యులచారు ఆశీర్వారముచేసి, కుర్చీలో కూర్చొని ఒకచిటికెడు పొడుము వేయుదురు.)

భీమ:-ఆచార్యులవారూ! సకాలమునకు వచ్చితిరి. అనుకొనినంత పనిజరిగినది. రాజా వివాహప్రయత్నములో యున్నట్టున్నది. నాబార్య వానిపక్షమవలంచించినది. ఏమిచేయవలెను?

విద్యా:- ఆతురపడకండి. లీలావతిదేవి గారికి ధర్మశాస్త్ర శ్రవణము గాచించెదను. కొంచెము జ్ఞానము కావలెను.

భీమ:-నిష్ప్రయోజనమండీ! మీమాటవినను. వివాహము కావింపుమని నాకే బుద్ధిచెప్పి పోయెను. మీమాటవినదు. నామాటవినదు.

51