పుట:Sangraha Andhra Vijnana Kosham Volume Three.pdf/844

ఈ పుట అచ్చుదిద్దబడ్డది

విజ్ఞానకోశము - 3

ఛత్రపతి శివాజీ మహారాజు

మున శివాజీ షోడశ మహాదానములు చేసెను. పిదప మంత్రులకు అధికార లాంఛనములను, నియామక పత్రములను ప్రసాదించెను. తరువాత ఉత్తమాశ్వము నెక్కి ఊరేగెను. పుణ్యాంగన లారతులిచ్చి, లాజలు చల్లిరి. ఈ శుభసందర్భమును పురస్కరించుకొని పురవాసులు తమ గృహాంగణములను దివ్యముగ నలంకరించిరి. ముస్లిముల ధాటికి నిలువలేక కొనయూపిరితోనున్న హిందూధర్మ సంప్రదాయము లన్నియు సమగ్రరూపమున పట్టాభిషేక మహోత్సవ మప్పుడు పరిఢవిల్లెను. ఇప్పుడు శివాజీ హిందూధర్మ రక్షకుడు. హిందూ సమాజమున కాదర్శ పురుషుడు, భారతీయ సంస్కృతికి ఆశాజ్యోతి.

1677 లో శివాజీ కర్ణాటక ప్రాంతముపై దాడి వెడలెను. ఇది అతని జీవితములో ప్రధానమైనది. పశ్చిమ కర్ణాటక ప్రాంతమును, బళ్ళారిని లోగొని, తంజావూరిని పాలించుచున్న సవతి తమ్ముడు వెంకోజీ నుండి కొంత రాజ్యమును స్వాయత్తము చేసికొని, రాయగడమునకు తిరిగివచ్చుచు, అతడు జింజీ, వెల్లూరులను వశపరచుకొనెను. ఇంచుమించు పశ్చిమ తీర ప్రాంత మంతయు శివాజీ రాజ్యమునకు పడమటి పొలిమేర అయ్యెను. శివాజీకి తండ్రినుండి లభించినవి కొన్ని జిల్లాలు మాత్రమే. కాని శివాజీ వానిని విస్తృత పరచెను.

1658 నుండియే అతడు నౌకానిర్మాణమున కుద్యమించి పశ్చిమ తీరమును దుర్గముగా చేసికొనెను. ఇది అతని రాజనీతి దక్షతకు నిదర్శనము. రాజ్యాదాయము పెంచుటకై అతడు సముద్రమార్గమున విదేశములనుండి వాణిజ్యమును కూడ ప్రోత్సహించెను. నౌకాబలము వలనను, విదేశీయ వ్యాపారము వలనను శివాజీ, బుడుత కీచుల యొక్కయు, ఆంగ్లేయుల యొక్కయు ఆగడముల నుండి భారతీయులు తట్టుకొనగలుగునట్లు ఏర్పాట్లు చేసి యుండెను. శివాజీ కొండ యెలుక యనియు, గెరిల్లా పోరాటమున ఆరితేరినవాడనియు, క్షత్రియోచితమైన పోరాటమున కతడు అలవాటుపడినవాడు కాడనియు ద్వేషపూరిత మనస్కులైన చారిత్రకు అతనిని వర్ణించిరి. కాని ఈ విదేశ వాణిజ్యమును, నౌకాబల నిర్మాణమును పరిపాలనా వ్యవస్థను పరిశీలించినచో శివాజీ ఔన్నత్యము మనకు గోచరించును. పశ్చిమతీర సమీపమున నున్న యొక ద్వీపమును అబిసీనియాదేశస్థులైన సిద్దీలు ఆక్రమించుకొని తీరప్రాంత నగరములను దోచుకొనుచుండిరి. శివాజీ వారిని కూడ అదుపులో పెట్టుటకు ప్రయత్నించెను.

శివాజీ చరమదశలో అతని కొడుకైన శంభూజీ (సంభాజీ) దక్కనులో మొగలు ప్రతినిధియైన దిలేరు ఖానుతో కలసి మహారాష్ట్రరాజ్య విచ్ఛేదమునకు దారి తీసెను. కాని 1679 లో శంభూజీ తన తప్పిదమును తెలిసికొని తండ్రితో కలిసెను.

1680 లో శివాజీ మహారాజు రోగగ్రస్తు డయ్యెను. రోగము నివారణ కాజాల దను సంగతి తెలిసిన తరువాత శివాజీ మంత్రులకు, అధికారులకు తగిన ఉపదేశము లిచ్చి సమాధి నిష్ఠుడై 4 ఏప్రియల్ 1680 ఆదివారము మధ్యాహ్నము దివంగతు డయ్యెను. మరణమునాటి కాతని వయస్సు 53 సంవత్సరములు. మరణము సంప్రాప్తమైనందుకు అనేకములైన కారణములను కొంద రూహించిరి. విషప్రయోగముననో, సయ్యదుఖాను మహమ్మదు అను ఆతడు ఫకీరు శాపము వలననో మరణించె నని వేర్వేరు కథనములు గలవు. కాని చారిత్రకముగ నివి నిరూపించుటకు వీలులేదు.

శివాజీ మరణము నాటికి అతడు నిర్మించిన మహారాష్ట్ర రాజ్యము సూరత్‌నుండి కార్వార వరకును, పశ్చిమసముద్రతీరమునుండి కొల్హాపురమువరకును ఏక ఖండముగా వ్యాపించిన రాష్ట్రము. ఇదిగాక బళ్ళారి, వెల్లూరు, తంజావూరు, జింజీ కూడ శివాజీ పలుకుబడిలో నుండెను. మొగలు రాజ్యము నందలి మొగలాయి అను పేరుగల ప్రాంతముకూడ శివాజీరాజుదే. 'చౌథ్' అను పన్నును ఈ మొగలాయి ప్రాంతమున వసూలుచేసికొను అధికారము మహారాష్ట్రుల కుండెను. శివాజీ రాజ్యమున 230 కోట లుండెను. అందు 111 అతడు స్వయముగ కట్టించినవి. 79 కోటలు మద్రాసు ప్రాంతమున నుండినవి. 40 కోటలు పరరాజుల నుండి వశపరచుకొన బడినవి.

శివాజీ గురువైన సమర్థ రామదాసస్వామి గట్టి ప్రభుత్వ మొక్కటి ఏర్పరచి దుష్టశిక్షణము, శిష్టరక్షణము గావించి తనకు ప్రతినిధిగా ధర్మపాలనము చేయుమని శివాజీని ఆదేశించి యుండుటచే, శివాజీ ముస్లిములను ముప్పుతిప్పలు పెట్టుటయే తన ధ్యేయముగ నుంచుకొనక

777