ఛత్రపతి శివాజీ మహారాజు
సంగ్రహ ఆంధ్ర
లకు పరిపాలనా వ్యవహారముల నప్పగించి. చిన్న చిన్న సైనికదళముల నేర్పరచి, తమ అదుపులో నుంచుకొను చుండిరి. ఈ దళములు శత్రువుల దాడి నుండి కాపాడుటకును, బందిపోటు దొంగల పీచ మడంచుటకును ఉపయోగపడుచుండును. ఈ మావళేలు శివాజీ విజృంభణముతో పైకి వచ్చిరి. ఈ మావళేలతో శివాజీ స్నేహమును సంపాదించి, వారికి నాయకుడయ్యెను. శివాజీ సైన్యమునకు మావళేల సంఘమే వెన్నెముకగా నుండెను. మావళేలు శివాజీని తమ నాయకునిగను సంరక్షకునిగను, పరిగణించిరి. పునహాప్రాంతము నందలి చిన్న చిన్న నాయకులు, పాలెగాండ్రు గ్రామములను కొల్లగొట్టుచుండిరి. న్యాయ, ధర్మములు నశించెను. అంతః కలహములు మెండయ్యెను. ఆ ప్రాంతము శక్తి గల వానికే సర్వస్వమయ్యెను. ఇట్టి విపత్కర పరిస్థితులలో తన దూరదృష్టి చేతను, శక్తిసామర్థ్యముల చేతను, నిష్పక్షపాత వైఖరి చేతను శివాజీ ఆ పల్లీయుల హృదయములను వశపరచుకొనెను. అతని రాజ్యమునకు పునాదులు వేసినది ఈ పీడిత ప్రజాహృదయములే. హిందూమత విధ్వంసకులకు విరుద్ధముగ మావళేలను పురికొల్పి, చైతన్యవంతులుగ చేసి, వారిలో జాతీయ భావమును ప్రజ్వలింప జేసెను.
ఈ ఆశయములకు ఫలమే శివాజీ మహారాజు. కొండదేవు కడ నాతడు చిన్నతనము నుండియే పరిపాలనానుభవమును కొంత గడించుకొని యుండెను. సమవయస్కులైన మావళేలతో స్వేచ్ఛా విహారము చేయుచు అడవులలో, కొండలలో ప్రభుత్వాధికారులు తారసిల్లినప్పుడు వారిని తికమకలుపెట్టి వారియొద్ద నుండు రాజధనమును శివాజీ కాజేయుచుండెడివాడు. అతని దృష్టిలో నిదియొక వీరోచిత చర్య. అహమద్ నగర మంతరించి పోవుట చేతను, ఆ ప్రాంతమున అరాజకము ప్రబలి యుండుట చేతను శివాజీ కిట్టిచర్యలను అవలంబించుటకు ఉత్సాహము కలిగెను.
శివాజీ సహ్యపర్వత ప్రాంతమున అడవులలో, లోయలలో, మావళే యువకులతో పరిభ్రమించుచు, అందు నివసించు జనులతో సంబంధము లేర్పరచుకొనుచు ఉండెను. విశ్వాసపాత్రులైన అధికారులు కొందరు శ్యామ్‌రాజ్ నీలకంఠ్, రంజేకర్ బాలకృష్ణ హనుమంతే, సోనాజి పంత్, రఘునాథ్ కోర్డే - ఈ నల్గురు 1642 లో శహాజీచే పునహాకు పంపబడిరి. వారు అతని జాగీరు నిర్వహణ భారము వహించుటకు నియమితులై యుండిరి. 1646 లో బిజాపుర సుల్తాను అగు అదిల్‌షా అస్వస్థుడగుటచే కర్ణాట నాయకులు స్వాతంత్ర్యమును ప్రకటించు కొనుచుండిరి. రాజ్యపరిపాలనము పట్టమహిషి బారిసాహెబా హస్తగత మయ్యెను. శివాజీకి ఇదే అదను. 1647 లో కొండదేవుడు దేహయాత్ర చాలించెను. ఇక శివాజీకి సలహాలిచ్చు వారు కాని, ఈతని స్వేచ్ఛావిహారముపట్ల మనస్తాపము చెందువారు కాని, మందలించువారు కాని లేకుండిరి.
కొండదేవుని మరణమునకు పూర్వమే బిజాపురపు సర్దారును మోసముచేసి యుద్ధము చేయకుండగనే శివాజీ తోరణ దుర్గమును స్వాధీన పరచుకొని యుండెను. ఈ దుర్గములో నున్న ధనరాశి అతని వశమయ్యెను. ప్రచండగడమని ఈ కోట కాతడు కొత్త పేరు పెట్టెను. ఈ కోటకు 5 మైళ్ళ దూరముననే అదే కొండల నడుమ రాజగడము అను కొత్త కోటను నిర్మించెను. ఈ యుదంతము బీజాపూరులో తెలిసెను. అయిన నేమి, కొందరు మంత్రుల నతడు వివిధో పాయములచేత తనకు అనుకూలురుగ మార్చుకొని యుండిన వా డగుటచేత వారు దాని కెట్టి ప్రాధాన్య మియ్యక మిన్నకుండిరి. పూనాకు పోవు మార్గము సంరక్షించుచున్న చాకన్ దుర్గముపై కొండదేవుడు ఫిరాంగ్ జీని దుర్గరక్షకునిగా నియమించియుండెను. ఇతడు విశ్వాస పాత్రుడగుటచే శివాజీ కూడ అతనినే నియమించెను. బారామతి, ఇందాపూరు దుర్గాధికారులు కిమ్మనకుండ శివాజీకి లొంగిపోయిరి. ఆదిల్ షా రాజప్రతినిధికి శివాజి లంచ మిచ్చి కోడాంగ్ దుర్గమును వశపరచుకొనెను.
1648 లో ఈ రాజ్య విస్తరణ కార్యక్రమము ఆగిపోవలసివచ్చినది. దక్షిణ ఆర్కాటు జిల్లాలో రాజప్రతినిధి గాను బీజాపూర్ సుల్తానుల సర్దార్ గా ఉన్న ముస్తఫా ఖాన్ శివాజీ తండ్రియైన శహాజీని నిర్బంధించి అతని ఆస్తిని, పరివారమును స్వాధీనపరచుకొనెనని కర్ణాటకము నుండి వార్తలు వచ్చెను. శివాజీ రాజనీతిని ప్రదర్శింప నెంచి, అప్పుడు దక్షిణమున బిజాపూరు సుల్తానులకు
774