పుట:Sangraha Andhra Vijnana Kosham Volume Three.pdf/836

ఈ పుట అచ్చుదిద్దబడ్డది

చైనా భాషాసారస్వతములు

సంగ్రహ ఆంధ్ర

దృష్టితో వ్యాఖ్యానించి, టావో, బౌద్ధసిద్ధాంతములను గూడ దానియం దంతర్భవింపజేసెను. ఇటీవల వరకును చుశీ వ్యాఖ్యానమే ప్రామాణికమై యుండినది .

చరిత్ర : చైనీయుల అత్యంత ప్రాచీనేతిహాసగ్రంథము 'షూచింగ్ ' అనునది. ఈ గ్రంథము యో, షున్, యూ మున్నగు పౌరాణిక చక్రవర్తుల కథలతో ఆరంభమై, చౌవంశచరిత్రమున కొంతవరకు వచ్చి ఆగిపోయినది. దీనితరువాత పేర్కొనదగిన చరిత్రగ్రంథము కన్‌ఫ్యూషియస్ వ్రాసిన 'ఛూన్ ఛియు' (వసంతము - హేమంతము) అను 'లూ' రాష్ట్రపాలకుల వృత్తాంతము. షీ చీ అను మహాగ్రంథము పేరెన్నికగన్న ఇతిహాసము. దీనికర్త రాజజ్యోతిష్కుడైన స్స్యూ-మా ఛీన్ (క్రీ. పూ. 145–187) అనునాతడు. ఇతడు ఆజన్మ విద్వాంసుడు. పదియేండ్ల వయస్సుననే ఆతని పాండిత్యము పట్టరానిదై యుండెను. ఇరువదేండ్ల వయస్సుననే ఆతడు చైనా దేశ సంచారమును ముగించెను. తండ్రి యనంతరము రాజ జ్యోతిష్కుడై, ఆతడు తండ్రి యారంభించిన ఇతిహాస గ్రంథమును పూర్తిచేసెను. 'షీ చీ' అను ఈ ఇతిహాస గ్రంథము ఐదు బృహత్ శీర్షికలక్రింద విభజింప బడినది. (1) ప్రభువుల చరిత్రము; (2) కాలానుక్రమణికలు; (3) లఘువ్యాఖ్యలు; (4) సామంతరాజుల వృత్తాంతములు: (5) జీవితచరిత్రలు. ఇది 'పీత చక్రవర్తి'యను పౌరాణిక పురుషుని కథతో ఆరంభమై, హాన్ వంశ చరిత్రతో అంతమగుచున్నది. తరువాత పుట్టిన చరిత్ర గ్రంథములన్నింటికి ఇదియే అదర్శమైనది. అట్టి గ్రంథములలో క్రీ. శ. 11 వ శతాబ్దియందలి టుంగ్ షీన్ అను ఇతిహాస దర్పణము పేర్కొన దగినది. దీని నిర్మాత స్స్యూ-మాక్వాంగ్ అనునాతడు. ఇట్టి మహాచరిత్ర గ్రంథములతో పాటు వందలకొలది జీవిత చరిత్రలు చైనీయ వాఙ్మయమున గలవు.

యాత్రాగ్రంథములు : చైనాదేశము యొక్కయు, అందలి రాష్ట్రముల యొక్కయు భౌగోళిక విషయములను వివరించు గ్రంథములు పెక్కు గలవు. క్షేత్రములను, తీర్థములను, శిథిలములను, పట్టణములను, మహా భవనములను వర్ణించు గ్రంథములు గూడ విశేషముగ గలవు. బౌద్ధమతము చైనాదేశమునం దడుగిడిన అనంతరమే చైనాప్రజలకు విదేశయాత్రాసక్తి కలిగెను. అట్టి యాత్రలుగూడ ముఖ్యముగ బౌద్ధమత జన్మభూమియగు భారతదేశమునకే పరిమిత మయ్యెను. పలువురు చీనా యాత్రికులు భారతదేశమునకు వచ్చియుండిరి. కాని వారిలో తమ యాత్రలను గురించిన వివరములను గ్రంథరూపమున రచించి, విజ్ఞానమునకు దోహదము గావించిన ఫాహియాన్ (క్రీ. శ. 399-414), హ్యుయన్ త్సాంగ్ (క్రీ.శ. 629-645) అను నిరువురు మాత్రమే చిరస్మరణీయులై యున్నారు.

విజ్ఞానశాస్త్ర సారస్వతము : క్రీ. పూ. 4 వ శతాబ్దికి చెందిన 'యుద్ధతంత్రము' అను గ్రంథమే చైనాభాష యందు అతి ప్రాచీనమైన శాస్త్రగ్రంథ మనవచ్చును. చైనాదేశమున కృషికిని, కర్షకునికిని అత్యంత ప్రాధాన్యము, గౌరవము ఉండినను, కృషి పాశుపాల్యములకు సంబంధించిన గ్రంధములు ప్రాచీనకాలమం దెవ్వియు రచింప బడినట్లు తోచదు. శూక్వింగ్ ఛీ అనునాతడు (క్రీ. శ. 1562-1634) సంకలనము చేసిన 'నుంగ్ చెంగ్ ఛువాన్ షు' అను గ్రంథమే ఇటీవలివరకును కృషి పాశుపాల్యములందు ప్రామాణిక గ్రంథముగా పరిగణింపబడు చుండెను. ఇది 60 అధ్యాయముల గ్రంథము. భూవిభజనము, కృషి, జలాధారములు, వ్యవసాయ సాధనములు, ఊడ్పు, పట్టు పురుగుల పెంపకము, చెట్ల పోషణము, పశుపోషణము, ఆహారధాన్యములు మున్నగు విషయములను గురించి ఈ గ్రంథమున విపులముగ వ్రాయబడి యున్నది. మంత్ర శాస్త్రము, సాముద్రిక శాస్త్రము, రసవాదము మున్నగు వివిధ శాస్త్రములపై పెక్కు గ్రంథములు గలవు. పురాతత్వ శాస్త్రము, ముద్రికా నిర్మాణము, కుమ్మరము, నాణెములు మున్నగువాటిపై ఎన్నో గ్రంథములు గలవు. లీషిహ్-చెన్ (క్రీ.శ.1578) రచించిన ' పెన్‌ట్సో' అను వైద్య గ్రంథము పేర్కొనదగి యున్నది. ఇందు 1892 మూలికలను, లవణములను, లోహములను గూర్చిన వివరణము కలదట. శ్యువాన్‌ హో (క్రీ. శ. 1119 - 1126) అను చక్రవర్తి కాలమున రచింపబడిన 'శ్యువాన్ హోహ్వావ్యు' అను చిత్రలేఖన గ్రంథము చాల ప్రసిద్ధమైనది. ఇందు ఆ చక్రవర్తి సేకరించిన 6192 చిత్రములను గురించిన వర్ణనములు కలవు.

768