పుట:Sangraha Andhra Vijnana Kosham Volume Three.pdf/834

ఈ పుట అచ్చుదిద్దబడ్డది

చైనా భాషాసారస్వతములు

సంగ్రహ ఆంధ్ర

పాశ్చాత్య నాగరికతా సంపర్కమువలన నూతన విజ్ఞానము చైనాదేశమునందు ప్రవేశించినప్పుడు, పెక్కు పారిభాషిక పదములు చైనీయ భాషలోని కెక్కినవి. వీటికి చైనావారు క్రొత్త పదములను సృష్టింపక, ఉన్న పదములయొక్క నానావిధ సంయోగముల చేతనే పద విశేషములను కల్పించుకొనిరి.

లిపి సంస్కరణోద్యమము : చిత్రరూపములు, భావరూపములు, ధ్వనిరూపములు నయిన వేలకొలది అక్షరములను గుర్తుపెట్టుకొనుట ఎట్టి మేధావంతునకైనను దుర్ఘటమే. కనుక చైనీయులు తమ లిపిని ఇతర భాషా లిపులవలెనే ధ్వన్యాత్మకము చేసికొనవలెనని తలచి కొంత ప్రయత్నము చేయుచున్నారు. రోమన్ అక్షరములను తమ భాషాస్వభావమున కనుగుణముగ సవరించి ఉపయోగించుకొనవలెనని వీరు యత్నించు చున్నారు. చైనీయ భాషయందు మాండలిక భేదము లెన్నియున్నను, అన్ని మాండలికములకును లిపి యొక్కటియే అనియు, అదియే వారి జాతీయైక్యమునకు చిహ్నముగా నున్నదనియు గ్రహించనగును. అట్టి లిపిని సంస్కరించు యత్నము సఫలమగుట సామాన్య విషయము కాదు. ఎట్టి ధ్వన్యాత్మక లిపియైనను, ప్రాచీన చైనా వాఙ్మయమును తిరిగి వ్రాయుటకు పనికివచ్చునట్లు కనిపించదు. ఆ భాషయందలి స్వరభేదములు కూడ చాల వైవిధ్యము కలవి. ఎన్ని స్వర చిహ్నములను ఉపయోగించినను, అన్య లిపిలో తిరిగి వ్రాయబడినచో, ప్రాచీన చైనా సాహిత్యము తన సౌందర్యమును, శ క్తిని చాలవరకు కోల్పోవలసియుండు నని విజ్ఞుల అభిప్రాయము.

చైనీయ సారస్వతము : క్రీస్తు పూర్వము 16 శతాబ్దుల నుండి, అనగా ఇప్పటికి ముప్పదియారు శతాబ్దులకు పైగా అవ్యాహతముగా కొనసాగుచుండిన చైనీయ సారస్వతము ప్రపంచమందలి జీన ద్భాషా సారస్వతములన్నింటిలో ప్రాచీనతమమని చెప్పుట అతిశయోక్తి కాదు. ఈ సారస్వతములో ప్రతివిషయమునుగూర్చియు అత్యంత విపులములగు గ్రంథములు గలవు. శబ్దకోశములు, విజ్ఞాన సర్వస్వములు, చరిత్రలు, ప్రమాణ గౌరవమున సాటిలేనివని చెప్ప నొప్పును. పెక్కు చారిత్రక గ్రంథములు సత్య కథనమున విఖ్యాతి గడించినవి.

చైనీయులు తమ సారస్వతమును సామాన్యముగ నాల్గు శాఖలుగా విభజించుట కలదు :

(1) కన్‌ఫ్యూషియన్ సిద్దాంతములు, శబ్దకోశములు, భాషా తత్వశాస్త్రము, పద పరిణామము మున్నగునవి.

(2) ప్రభుత్వములు గాని, వ్యక్తులు గాని రచించిన వివిధ చరిత్రలు, రాజ్యాంగ శాస్త్రము, జీవిత కథలు, గ్రంథ పట్టికలు, భూగోళశాస్త్రము, ప్రభుత్వ వ్యవహారములు మున్నగునవి.

(3) తత్వశాస్త్రము, మత గ్రంథములు, బౌద్ధ సిద్ధాంతములు, విజ్ఞాన శాస్త్రములు, కళలు మున్నగునవి; యుద్ధతంత్రము, నీతి, కృషి, జ్యోతిషము, వైద్యము, సంగీత సాహిత్య శాస్త్రములు, విజ్ఞాన సర్వస్వములు మున్నగునవి.

(4) ప్రత్యేకములయిన కావ్యములు, కావ్య విమర్శనములు, ఛందోగ్రంథములు, అలంకార గ్రంథములు మున్నగునవి. చారిత్రక దృష్టితో చైనీయ సాహిత్యమును వేర్వేరు యుగములుగా విభజించు సంప్రదాయము కూడ కలదు. అందు పేర్కొన దగినవి : (1) ఆదిమ యుగము, (2) కన్‌ఫ్యూషియన్ యుగము, (3) బౌద్ధం-టావో సిద్ధాంత యుగము, (4) కావ్యయుగము, (5) సారస్వత వికాస యుగము, (6) నాటక, నవలా యుగము, (7) వైజ్ఞానిక యుగము, (8) ఆధునిక యుగము.

చైనీయ సారస్వతము వివిధ శాఖల యందు కాలక్రమమున వర్ధిల్లిన రీతి :- కవిత : క్రీ. పూర్వము పది శతా బ్దుల క్రిందటనే చైనాభాష యందు కవితారచన ప్రారంభింపబడినది. 'చౌ' వంశ ప్రభువుల కాలమునకు చెందినవని తలంప బడుచున్న పెక్కు గీతములు 'షిహ్ చింగ్ ' (గీత మంజరి) అను పేర గ్రంథ రూపమున సంకలనము చేయబడినవి. ఇందు పెక్కు గీతములు కన్‌ఫ్యూషియన్ సిద్ధాంతము ననుసరించినవి. మతము, ప్రేమ, భోగములు, ప్రభువుల వ్యసనములు, అధికారులు దుండగములు మున్నగు నానా విషయములపై వ్రాయబడిన గీతము లిందు గలవు. ఎక్కువ భాగము మత సంబంధమైన కర్మకలాపమునకు చెందినది. చైనీయ కవితకు టాంగ్ వంశపు కాలము స్వర్ణయుగము వంటిదని చెప్పవచ్చును. అత్యుత్తమ శ్రేణికి చెందిన మహాకవు లెందరో ఆ యుగమున వర్ధిల్లిరి. మెంగ్

766