విజ్ఞానకోశము - 3
చైనా భాషాసారస్వతములు
ఆరంభమైయున్నను, కాలక్రమమున దానియందు పెక్కు మార్పులు జరిగినవి.
క్రీస్తు పూర్వమునందు 18 శతాబ్దములనాటి అక్షర స్వరూపమునకును, నేటి అక్షర స్వరూపమునకును చాల వ్యత్యాసము కలదు. క్రీ. పూ. 1766 మొదలు 1122 వరకు పాలించిన 'యిన్' వంశపు రాజుల నాటివని ఊహింప బడుచున్న భూమికలపై వ్రాయబడిన లేఖనములు ఇటీవల దొరకినవి. వాటిలో సుమారు 2500 అక్షర చిహ్నములు ఉన్నవట. తరువాత 'చౌ' రాజ వంశము పాలించు కాలమున 'ముద్ర' అనబడు లిపి వాడుకలోనికి వచ్చెను. క్రీస్తు శకారంభమున 'అధికార లిపి' అమలులోనికి వచ్చెను. దీనిని ఆరంభించినవారు 'హాన్' వంశ చక్రవర్తులు. దీని నుండి క్రమముగా రెండు విధములైన లిపులు పుట్టినవి. (1) 'ఛేవోషు' అనబడు గడ్డి పరకలవంటి అక్షరములు; (2) 'శింగ్‌షు' అనబడు గొలుసుకత్తు అక్షరములు. క్రీ. శ. 4వ శతాబ్దియందు ప్రసిద్ధ లేఖకుడైన వాంగ్-శి-చిహ్ అను నాతడు మిక్కిలి సుందరమైన 'ఖెమ్ షు' అను లిపిని ప్రవేశ పెట్టెను. ముద్రణ విధానము కనిపెట్టబడినప్పుడీ అక్షరములే స్వీకరింప బడెను. నేటివరకును ఈ లిపియే వాడుకలోనున్నది.
చైనీయులు మొదట వెదురు కలములతో వెదురు బద్దల మీదనో, కొయ్యపలకల మీదనో వ్రాయుచుండు వారు. కాలక్రమమున క్రీ. పూ. 200 సంవత్సర ప్రాంతమున వెదురు కలమునకు బదులు సన్నని కుంచెను వాడ నారంభించిరి. కొయ్య పలకకు బదులు పట్టువస్త్రములను ఉపయోగింప దొడగిరి. క్రీ. శ. 105 వ సంవత్సర ప్రాంతమున 'హాన్' వంశ ప్రభువులు కాగితమును తయారు చేయించిరి. క్రీ. శ. 770వ సంవత్సర ప్రాంతమున ముద్రాక్షరములు కనిపెట్టబడుటచే, బౌద్ధధర్మ గ్రంథములు మున్నగునవి ముద్రింపబడ సాగినవి.
వ్యాకరణము : చైనీయభాషకు వ్యాకరణము లేదనియే చెప్పవచ్చును. చైనీయులకు వ్యాకరణ సూత్రముల అవసరమే కనిపింపలేదు. నామవాచకము, క్రియ, సర్వనామము మున్నగు భాషాభాగములు అందులేవు. పూర్ణపదములు, రిక్తపదములు అని పదములను ప్రాచీన చైనీయులు రెండు తెగలుగ చేసిరి. పూర్ణపదములు మరల జీవత్పదములు, మృతపదములు అని విభజింప బడెను. జీవత్పదము లనగా క్రియాపదములు. మృత పదము లనగా నామవాచకములు. రిక్తపదము లనగా ప్రత్యయములు, అవ్యయములు మున్నగునవి. కారకము, సంధి, సమాసము మున్నగు ప్రక్రియలు చైనా భాషయందు లేవు. ఏ పదమున కాపదము స్వతంత్రము . సందర్భమును బట్టియు, వాక్యమందలి దాని స్థానమును బట్టియు ఒకే పదము సర్వ భాషాభాగములు పనిచేయు చుండును. లింగ, వచన, విభక్తి, కాల, పురుషాది భేదములు ఏ పదమునకును ప్రత్యేకముగా నుండవు. ఉదా : 'పై' అనుమాట రాజు, గొప్ప, ఎత్తైన, మీదుగా, ఎక్కుట అను అర్థములలో వివిధ భాషాభాగములుగా పనిచేయును. క్రియా పదమునకు ముందు నిన్న, పూర్తి మున్నగు పదములను చేర్చుటచే భూతకాలము, మరునాడు, ముందుకాలము అను శబ్దములను చేర్చుటచే భవిష్యత్కాలము సూచింప బడును.
గ్రాంథిక, వ్యావహారిక భాషలు : చైనీయుల గ్రాంథిక భాషకును, వ్యావహారిక భాషకును చాల వ్యత్యాసము కలదు. వ్యవహారమందలి ద్వ్యక్షర పదములు గ్రంథములం దుండవు. ఉదా : షీన్- చూచు; ఖాన్ - కను. వ్యవహారమున 'చూచు' అనుటకు 'ఖాన్ - షీన్' ఆను ద్వ్యక్షర ప్రయోగముండును. గ్రంథములందు 'షీన్' అను ఏకాక్షర పదప్రయోగమే ఉండును. వ్యర్థపదములు, ప్రత్యయములు గ్రాంథిక భాషయం దుండవు. గ్రాంథిక భాష సూత్రప్రాయమై అర్థబంధురముగను, వ్యాఖ్యాన సాపేక్షముగను ఉండును. సంక్షిప్తత ప్రాచీన చైనా వాఙ్మయముయొక్క ముఖ్యలక్షణము, అక్షర రచన సౌలభ్యము చెందిన కొలది, ముద్రణాది సౌకర్యములు పెంపొందిన కొలది, గ్రంథ రచనాశైలియు, వెనుకటి సంక్షిప్తతను క్రమముగా సడలించుకొనినది. తమ ప్రాచీన సాహిత్యముపై చైనా ప్రజలకు మిగుల భక్తిగలదు. విద్యాధికులకు కూడ అది యొకపట్టున అర్థముకాదు. గ్రాంథిక పదములు పెక్కు వ్యవహారమునలేవు. వ్యవహార మందలి పదములకు పెక్కింటికి అక్షర చిహ్నములు లేవు. అనుప్రాసాది శబ్దాలంకారములతో గూడినదై, గ్రాంథికభాష మిక్కిలి ప్రౌఢముగను, రమ్యముగను ఉండును.
765