పుట:Sangraha Andhra Vijnana Kosham Volume Three.pdf/825

ఈ పుట అచ్చుదిద్దబడ్డది

విజ్ఞానకోశము - 3

చైనాదేశము (భూ)

ప్రారంభించిరి. 1-1-1942 నాడు చియాంగ్ కేషేక్ మిత్రమండలితో చేరి, చైనారంగమున మిత్రమండలి సైన్యములకు నాయకు డయ్యెను. ఆ సంవత్సరము అక్టోబరు నెలలో బ్రిటను, అమెరికాలు తమకు చైనాలోగల హక్కులను త్యజించిరి. ఐక్యరాజ్య సమితిలో అమెరికా, రష్యా, బ్రిటను, ఫ్రాన్సులతో పాటు చైనా అగ్రరాజ్యముల కోవలో చేరినది.

యుద్ధానంతరము చైనా : అణుబాంబు ప్రయోగముతో 10-10-1945 వ తేదీన జపాను మిత్రమండలికి లొంగినది; యుద్ధము ముగిసినది. చైనా, మంచూరియాలనుండి జపాను తిరోగమించినది. చైనా విదేశీయులనుండి విముక్తి పొందినది. కాని కూమిన్‌టాంగ్, కమ్యూనిస్టుల మధ్య అంతఃకలహము తీవ్రరూపము దాల్చినది. యుద్ధము ముగియు చుండగనే మంచూరియా మొదలు హొయాంగ్‌ హో నది పర్యంత భాగము కమ్యూనిస్టుల వశమైనది. కమ్యూనిస్టులు రైతుల సానుభూతిని పడసిరి. గొరిల్లా దళములను తయారుచేసిరి. జపాను సైనికులనుండి సంగ్రహించిన ఆయుధములు, చియాంగ్ కు అమెరికా సరఫరాచేసిన ఆయుధములు వారి హస్తగతమైనవి. అంతేగాక సోవియట్ రష్యా మద్దతు వారికి పూర్తిగా నుండెను. అన్నిటికంటె ప్రధానమైనది చియాంగ్ ప్రజాదరణమును కోల్పోయినాడు. అందుచేత అంతర్యుద్ధముద్వారా తమ ప్రభుత్వమును స్థాపింపగల మను విశ్వాసముతో కమ్యూనిస్టులు చియాంగ్ తో యుద్ధమునకు తలపడిరి. ఉభయపక్షములకు ఒడంబడిక కుదుర్చుటకై అమెరికన్ రాయబారి పాట్రిక్ హార్లీ, జార్జి మార్షల్ సేనాని, శక్తికొలది ప్రయత్నించిరి. లాభములేక పోయెను. చుంకింగ్ లో, చియాంగ్ కే షేక్ మావ్ సేటుంగ్ లమధ్య జరిగిన సంధిప్రయత్నము విఫలమగుటతోడనే (1946) కమ్యూనిస్టు సైన్యములు విజృంభించి పెక్కు రాష్ట్రముల నాక్రమించెను. హిసూచో, చించో, ముక్డెన్, చాంగ్ చన్ మొదలయిన యుద్ధములలో నోడిన కూమిన్‌టాంగ్ సైన్యములు కమ్యూనిస్టులతో చేరెను. 12-12-1948 వ తేదీన పీకింగ్ ను కమ్యూనిస్టులు ఆక్రమించిరి. చియాంగ్ - కే-షేక్ అధ్యక్ష పదవికి రాజీనామా యిచ్చెను. ఉపాధ్యక్షుడైన వీసంగ్ జన్ జరిపిన సంప్రదింపులు విఫలమైనవి. యాంగ్సీనదిని దాటి, కమ్యూనిస్టులు నాన్‌కింగ్, షాంఘై, కాన్‌టన్ మున్నగు నగరముల నాక్రమించిరి. చియాంగ్ మున్నగు కూమిన్‌టాంగ్ నాయకులు ఫార్మోజా (తైవాన్) ద్వీపమునకు వలసపోయి జాతీయ ప్రభుత్వమును స్థాపించిరి. చైనాలో కమ్యూనిస్టు విజయము పూర్తియైనది.

చైనా ప్రజాగణతంత్రము (Peoples Republic) : పీకింగ్ రాజధానిగా చైనాలో 1-10-1949 నాడు చైనీయ ప్రజాగణతంత్రమను పేర కమ్యూనిస్టు ప్రభుత్వము స్థాపింపబడినది. మావ్ సేటుంగ్ అధ్యకుడై వాడు. చౌ-ఎన్-లై ప్రధాని అయ్యెను. 1959 లో మావ్ సేటుంగ్ అధ్యక్ష పదవినుండి విరమించి, కమ్యూనిస్టుపార్టీ నాయకత్వము వహించెను. లియోసౌచీ, చైనాకు అధ్యక్షుడైనాడు.

కమ్యూనిస్టు సిద్ధాంతముల ననుసరించి చైనాలో రాజకీయ, ఆర్థిక, సాంఘిక పునర్నిర్మాణము జరుగుచున్నది. 1954 లో నొక రాజ్యాంగము అమలు జరిగినది. పేరునకు ప్రజాస్వామ్యమే ఐనను, ఏకపక్ష ప్రభుత్వమై, ఆర్థిక, రాజకీయాధికారములు ఆ ప్రభుత్వమునందే కేంద్రీకృతమై యున్నవి. భూ సంస్కరణములద్వారా సమష్టి వ్యవసాయ క్షేత్రములు స్థాపింపబడెను. విద్యాభివృద్ధి సాధింపబడినది. కమ్యూనిస్టు సిద్ధాంతములు ప్రచారములోనికి వచ్చినవి.

బి. యస్. యల్. హ.


చైనాదేశము (భూ) :

ప్రపంచమందు జనసంఖ్యా విషయమున దేశములలో నెల్ల చైనా గరిష్ఠమైనది. వైశాల్యమున రష్యా, కెనడాలు మాత్రమే దీనికంటె పెద్దవి. ఇది ప్రధానముగా వ్యవసాయముపై ఆధారపడు దేశము. ఏ ఒక్క దేశము నందైనను పండనన్ని పంటలు మొత్తము ఇచ్చట పండుచున్నవి. ఇతర ప్రాచ్యదేశములవలె చైనాగూడ గ్రామీణ జనసంఖ్య యనెడు ప్రధాన సమస్యను ఎదుర్కొనవలసి యున్నది. 1953 వ సంవత్సరము జులై 30 వ తేదీన దేశవ్యాప్తముగా ప్రప్రథమమున చేయబడిన ప్రభుత్వపు జనాభాలెక్కల ప్రకారము చైనా ప్రధాన భూభాగము నందును. ఫార్మోజా దీవి యందును కలిసి మొత్తము 59 కోట్ల జనులు కలరని తెలియుచున్నది. చైనా వైశా

757