పుట:Sangraha Andhra Vijnana Kosham Volume Three.pdf/786

ఈ పుట అచ్చుదిద్దబడ్డది

చెన్నకేశవస్వామి

సంగ్రహ ఆంధ్ర

మాచెర్ల చెన్న కేశవస్వామి గొప్ప మహత్తు గలవాడుగా నున్నాడు. బ్రహ్మనాయకుడు, పల్నాటివీరులు, పురుషులు, స్త్రీలు, ఆబాలగోపాలము ఆ స్వామియందు అత్యధిక భక్తిప్రపత్తులు కలిగి యుండిరి. స్వామివారును ఆ వీరులయెడ ప్రసన్నముఖుడై యుండెడివాడు. ఈ చెన్న కేశవస్వామి లీలలు పల్నాటి వీరుల చరిత్రయందు పలుచోట్ల వర్ణితములై యున్నవి.

ఉత్తర హిందూదేశమున పాల మాచాపురియందు కార్తవీర్యార్జునుని వంశజుడయిన అనుగురాజు పాలించు చుండెను. ఆ వంశమునకు గల పురాకృతపాపములను పరిహరించు కొనుటకు అనుగురాజు దానములు చేయు చుండగా వారి ఇలవేల్పగు కనకాద్రి చెన్న కేశవుడు ముదుసలివేషము ముచ్చటదాల్చి వడకుచు “హరి హరి” అనుచు ఏతెంచి, అనుగురాజు నీలి కోకలు ధరించి పుణ్య తీర్థములలో స్నానము చేయ వలయుననియు, ఏ పుణ్యతీర్థస్నానమున ఆతడు ధరించిన నీలికోకలు ఎప్పుడు తెల్లబడునో అప్పుడు బ్రహ్మహత్యాదోషము మాసిపోవుననియు చెప్పెనట ! ఆప్రకారము అనుగురాజు సంచారము చేయుచు మోటుపల్లివద్ద సముద్ర స్నానము చేయగా నీలి కోకలు తెల్లనయి బ్రహ్మహత్యాదోషము పోయెనట! ఈ స్నానము చేసినది కృష్ణానది యని పాఠాంతరము కలదు.

అనుగురాజు చందవోలురాజు కూతురు అగు మైలమాదేవిని వివాహమాడిన తరువాత తిరిగి స్వస్థానమగు పాలమాచాపురి కేగ నుద్యమించెను. అప్పుడు కనకాద్రి చెన్న కేశవు డాతనికి కలలో కనబడి “మన మిద్దరము గురుజాలయందే యుంద” మని చెప్పి అదృశ్యుడయ్యెనట! అనుగురాజు స్వామియాజ్ఞను అనుసరించి గురుజాలను రాజధానిగా చేసికొని, దేవాలయము కట్టించి చెన్న కేశవుని ప్రతిష్ఠించెను.

నాయకురాలు బ్రహ్మనాయని ఎదుట కోళ్ళపోరు ఏర్పరచెను. అందులో ఒక కోడి భయపడి పారిపోయెను. అప్పుడు “పారిపోయెడి పుంజు బ్రహ్మన్న" దనుచు ఆమె

చిత్రము - 209

పటము - 2

నాగస్తంభ శిల్పవిన్నాణము - మాచెర్ల

724