పుట:Sangraha Andhra Vijnana Kosham Volume Three.pdf/785

ఈ పుట అచ్చుదిద్దబడ్డది

విజ్ఞానకోశము - 3

చెన్నకేశవస్వామి

మాచెర్ల చెన్న కేశవస్వామి పల్నాటి వీరుల ఆరాధ్య దైవమగుటచే ఆంధ్రదేశపు ప్రసిద్ధదేవాలయములలో ఆ చెన్నకేశవాలయము ఒకటి యైనది. చంద్రవంకనది ఈ దేవాలయము వద్దనే ఉత్తర దిశగా మలుపుదిరిగి ప్రవహించుచున్నది. చంద్రవంకను 'చంద్రభాగ' యని పిలుచుట కద్దు. ఇచ్చటగల ఆదిత్యేశ్వరాలయము లోని శాసనములోను, వీరభద్రేశ్వరాలయ మందలి మరియొక శాసనములోను 'చంద్రభాగ' యనియే చంద్రవంక నది పేర్కొనబడినది. మాచెర్ల వద్ద బాలచంద్రునివలె (అర్ధచంద్రాకృతిగా) వంకరగా ఈవాగు ప్రవహించుటచే దీనికి చంద్రవంకయను పేరు వచ్చిన దని చెప్పుదురు.

చెన్న కేశవాలయము పురాతనమైనది. బ్రహ్మనాయడు గుడికి ప్రాకార మండపములు చక్క జేసెనని చెప్పుదురు. దేవాలయము చుట్టును గోపురములు, ఎత్తైన పెద్దగోడ ఉన్నవి. దేవళముయొక్క స్తంభములపై అనేక పురాణ గాథలు చెక్కబడినవి. ప్రాకారపు గోడల మీద చక్కటి శిల్పకళ గలదు. గోపురముల నిర్మాణ రీతులు చూచినట్లయిన అవి 12 వ శతాబ్దమునాటి కట్టుబడులనియు, చోళశిల్పుల నిర్మాణమనియు, ద్రావిడ సంప్రదాయముతో కూడియున్నవనియు తెలియగలదు.

ప్రతి సంవత్సరము మాచెర్లలో చైత్రశుద్ధ పూర్ణిమ మొదలు కొన్ని దినములు చెన్న కేశవస్వామి ఉత్సవములు జరుగు చుండును. చైత్ర బహుళ పంచమినాడు జరుగు రథోత్సవ సందర్భమున వేలకొలది యాత్రికులు వివిధ ప్రాంతములనుండి వచ్చి ఆ ఉత్సవములలో పాల్గొనుచుందురు. తిరునాళ్ళలో పిచ్చుకకుంటులవారు, పల్నాటి వీరచరిత్రను సుద్దులుగా గానము చేయుట సంప్రదాయముగా వచ్చుచున్నది.

చిత్రము - 208

పటము - 1

చెన్నకేశవస్వామి ఆలయము - మాచెర్ల

723