విజ్ఞానకోశము - 3
చెంచులు
ములు మిక్కిలి తక్కువ. కాని మెరక చెరువులలో చేతికి సులభముగా చిక్కు చేపలను పట్టుకొందురు. చేపలను కఱ్ఱ గాలములతో పట్టుకొనుట కూడ వీరు నేర్చియున్నారు. వీరు దున్నపోతు, ఆవు, మేక మొదలగు కొన్ని గృహ జంతువులను పెంచుదురు. జొన్న, వరి, రామములగపండ్లు(టొమేటాలు), మిర్చి మొదలగు పంటలను కొలదిమాత్రముగ ఇండ్ల ముందర పండించుట వరకే వీరి వ్యవసాయము పరిమితమై యున్నది. నేలపై గడ్డి తీసివేసి ఏదో ఒక కఱ్ఱతో భూమిని త్రవ్వెదరు. విత్తనములను నాటునప్పుడు ఒక మనుష్యుడు తిన్నగా నడచుచు, అడుగడుగున ఆగి, కఱ్ఱతో నేలయందు గుంటలుచేసి, ఆ గుంటలలో విత్తనము లుంచి, పాదముతో ఆ గుంటపై మట్టి నెట్టుచు పోవుదురు.
చిత్రము - 207
పటము - 2
చెంచుయువకుడు తలమీద జుట్టుముడివేయు పద్ధతి ఒక విశేషము
చెంచుజాతివారు మెన్లూరు, టోకల్, నిమల్, సింగార్లు, నల్లపోతేరు, ఎరవలు, పుల్సారు, ఉర్తాలు, దాసెరోలు, మామెడి, కట్రాజ్, బాల్ మార్ అను తెగలు లేక కులముల క్రింద విభజింపబడియున్నారు. ఈ తెగలలో అంతర్వివాహ పద్ధతి యున్నను, కొందరు బాంధవ్యమును బట్టి పెద్ద తెగలుగా ఏర్పడుటచే, అందరును అట్టి వివాహములను చేసికొనరు.
ప్రతి చెంచు పల్లెయందును, 'పెద్ద' యను నొక డుండును. అతడు సాధారణముగా వయోవృద్ధుడుగా గాని, మధ్య వయస్కుడుగా గాని ఉండవచ్చును. కాని పల్లెలో అందరి కంటె అతడు వృద్ధుడుగా నుండి తీరవలె నను నియమము మాత్రము లేదు. పూర్వకాలపు అనాగరకుల వలెనే చెంచువారు సంఘములుగ నుందురు. వారు మిక్కిలి స్వతంత్రులైన ప్రజాస్వామ్యవాదులు. 'పల్లె పెద్ద' అందరిలో పెద్దవాడుగ పరిగణింప బడినను, అతని అధికారము, పలుకుబడి అతని ప్రవర్తనను బట్టియు, సామర్థ్యమును బట్టియు ఉండును. ఈ 'పెద్ద మనిషి' ఐన వాడు దృఢ మనస్కుడై ఉండవలెననియు, అతనిని చూచినచో, పెద్దపులిని చూచినట్లు ఇతరులు భయపడవలెననియు చెంచుల అభిప్రాయము. ఈ జాతివారి ఆలోచనా సభలో (పంచాయితీ), నేరములలో చిక్కుకొనిన వేరువేరు గుంపుల 'పెద్ద మనుష్యులును'ను ఆయా పల్లెల పెద్దమనుష్యులును ఉందురు.
చెంచుల మతములో ఒకదాని కొకటి సంబంధములేని నమ్మకములు, ఆచారములు ఉండును. 'గారెల మైసమ్మ', 'భగవంతరు' అనువారు వీరి ముఖ్యదేవతలు. వీ రిరువురును కరుణామయులైన దేవతలుగను, ప్రకృతి శక్తులను, మానవ జీవితశక్తులను అదుపులో పెట్టగలవారుగను భావింపబడు చున్నారు. 'భగవంతరు' ఆకాశములో నివసించు ననియు, 'గారెల మైసమ్మ' అరణ్యములం దుండు ననియు వీరు నమ్మెదరు. చెంచులు అడవికి పోవునపుడును, అడవినుండి జంతువులను తీసికొని ఇంటికి వచ్చునపుడును 'గారెల మైసమ్మ'ను ప్రార్థించెదరు. చెంచులు ప్రమాదకరమైన జబ్బులోనున్నప్పుడు, నిస్సహాయతతో మానవాతీత శక్తులను నమ్ముకొని, వాటిని వేడుకొందురు. చనిపోయిన వారిని పాతిపెట్టుటగాని, దహనము చేయుటగాని జరుగుచుండును. కాని ఖననము చేయుటయే సర్వ సాధారణమైన పద్ధతి. ఈ సందర్భములో ఎట్టి కర్మకాండలు జరుగవు. కాని సమాధిని మూసివేయుటకు ముందు, చనిపోయినవాని భార్యయో, లేక చనిపోయిన ఆమె భర్తయో, లేక రక్త సంబంధముగల మరియొక
715