పుట:Sangraha Andhra Vijnana Kosham Volume Three.pdf/766

ఈ పుట అచ్చుదిద్దబడ్డది

చిరుధాన్యములు

సంగ్రహ ఆంధ్ర

మత్తు కల్గించును; జ్వరమును, కఫమును హరించును. జఠరదీప్తి నిచ్చి రక్తవృద్ధి కలుగజేయు. కాని వాతమును కల్గించును. దోషములకు నెయ్యి, పంచదార, సికింజిబీను విరుగుళ్ళుగా పనిచేయును.

5. ఆరిక : ఆరికకు కూడ భారత దేశమే ఆదిమస్థానమై యుండవచ్చును. ఇది మద్రాసు, బొంబాయి, రాష్ట్రములలో కొన్ని ప్రదేశము లయందు విస్తారముగా సాగగుచున్నది. ఆరిక మొక్క సుమారు 1½ మొ. 2½ అడుగుల ఎత్తున పెరుగు దుబ్బు. ఒక్కొక్క దుబ్సునకు 3-8 కర్ర లుండును. ఆరిక ఆకులు సన్నముగ, సుమారు 12-18 అంగుళముల పొడవుండును. వెన్నులు సాధారణముగా కాండమునకు తుది గల రెండు కనుపులయందును బయలుదేరును. వెన్నులో సామాన్యముగ మూడేసి రెల్ల లుండును. రెల్లల పొడవు 1-3 అంగుళము లుండును. ఆరిక మొక్కలకు కూడ కొన్ని భాగముల యందు ఊదారంగు ఏర్పడును. ఆరిక గింజలు లేత గోధుమరంగు కలిగి, కొర్ర, గంటె గింజల కంటె పెద్దవిగ నుండును. ఆరికలో పెద్ద ఆరిక, చిన్న ఆరిక యను రెండు ముఖ్యమగు రకములు కలవు. ఆరిక ఉష్ణమండలములలో చక్కగా పెరుగు మెట్ట పైరు.

చిత్రము - 198

ఆరిక వెన్ను.

పటము - 5

ఈ ధాన్యమును ఇంగ్లీషు భాషలో 'కాడో మిల్లెట్' (Kado Millet) అనియు, లాటిను భాషలో 'పెస్పలమ్ స్క్రోబిక్యులేటమ్' (Pespalam Scrobiculatum) అనియు పిలతురు. దీని అన్నము వెగటుగా, స్వాదుగా నుండును. విరేచన బద్ధముచేయును. రక్త పైత్యమును, సంగ్రహణిని కఫమును పోగొట్టును. తేలు కాటుకు వీనితో చికిత్స చేయుదురు. కొంచెము మత్తు కలిగించును.

6. చామ : చామసస్యము ప్రాచీన కాలము నుండియు భారత దేశమున సాగులో నున్నట్లు తెలియుచున్నది. ఇది ఈజిప్టు దేశము నుండి ఇండియాకు వచ్చియుండవచ్చునని కొందరి అభిప్రాయము. ఇది ఇండియాలోను, సింహళ ద్వీపములోను కొంత సాగులో నున్నది. చామమొక్క 2 మొదలు 3 అడుగుల యెత్తున దుబ్బుగా పెరుగును. ఒక్కొక్క దుబ్బునకు సాధారణముగా 3 మొ. 6 పిలక లుండును.

చిత్రము - 199

చామ వెన్ను.

పటము - 6

చామ ఆకు చిన్నదిగ 2-4 అంగుళముల పొడవు గల తొడిమతో, 12-20 అంగుళముల పొడవుతో, i-1 అంగుళము వెడల్పుతో నొప్పారు రేకు కలిగి యుండును. చామ వెన్నునకు చాల రెల్ల లుండును. అది 6-12 అంగుళముల పొడ వుండి, వరి వెన్నువలెనే వ్రాలు చుండును. చామగింజలు కొర్రల కంటే కొంచెము చిన్నవిగను కోలగను ఉండి, మొనదేలి యుండును. చామలలో కూడ కొన్ని రకములు గుర్తింపబడుచున్నవి. కొన్ని రకములకు ఊదారంగు ఉండును. చామపైరునకు తేమ హెచ్చుగా నుండవలెను. ఇది ఇసుక కొడి నేలలందును, ఎర్రనేల లందును సాగుచేయబడును. ఇది మెట్ట పైరు.

704