పుట:Sangraha Andhra Vijnana Kosham Volume Three.pdf/765

ఈ పుట అచ్చుదిద్దబడ్డది

విజ్ఞానకోశము - 3

చిరుధాన్యములు

మొక్క యొక్క కొన్ని భాగములందు ఊదారంగు బయలుదేరును. చోడి గింజలు చాల చిన్నవిగా నుండును. వెన్ను యొక్క తీరును పట్టి ముద్దచోడి యనియు, రెల్ల చోడి యనియు, గింజల రంగును బట్టి, ఎర్ర, నల్లమబ్బు, తెల్ల చోళ్ళనియు చోడిరకము లుండును. చోడి మెట్టపైరుగ సాగు చేయబడును. ఇది నీరుకట్టియు గూడ సేద్యము చేయబడుచుండును. మెట్ట చోళ్లు, ఊడ్పు చోళ్లు, తొలకరి చోళ్లు, పెద్దచోళ్లు అని వ్యవసాయదారులు చోడి రకములను తరచుగ పేర్కొనుచుందురు. చోడి ఉష్ణమండలములోను, సుమారు 5000 అడుగుల ఉన్నతప్రదేశము లందును పెరుగును. దీనికి తేమ హెచ్చుగానుండు ప్రదేశము కావలెను. చోడి అన్ని విధములయిన నేలలయందును పెరుగును. అయినను గరపనేలలు, ఇసుక గరువులు ఎక్కువ అనుకూలములుగా నుండును.

చోళ్లను లాటిన్ భాషలో 'ఎలెన్‌సైన్ కొరకేన్' (Elencine coracane) అనియు, సంస్కృతములో 'రాజక' అనియు పిలచెదరు. దీని జావ పుష్టినిచ్చి, సమశీతలము చేయును; పైత్యమును హరించి, రక్తస్రావము నాపును.

4. కొర్ర : కొర్ర భారతదేశమున ప్రాచీనకాలము నుండియు సాగులోనున్న తృణధాన్యము, యజుర్వేదమున ఉదాహరింపబడిన సప్తగ్రామ్యములలోను, బృహదారణ్యకోపనిషత్తున పేర్కొనబడిన దశధాన్యములలోను కొర్ర యొకటియై యున్నది. అందుచే భారతదేశమే ఈ సస్యమునకు ఆదిమస్థానమని కొందరి నమ్మకము. భారతదేశమునకంటె ప్రాచీన కాలమున చైనా దేశమున కొర్ర సాగులో నుండెనని మరికొంద రూహించుచున్నారు. భారతదేశము, ఇటలీ, చైనా, జపాను, ఉత్తర ఆఫ్రికా, కెనడా, అమెరికా సంయుక్త రాష్ట్రములు మున్నగు దేశములలో కొర్ర ఎక్కువగా సాగుచేయబడుచున్నది. కొర్ర మొక్క సాధారణముగ 3-5 అడుగులు పెరుగు. కొర్ర కూడ దుబ్బు కట్టును. దీని కాండము, ఆకులు గంటేకంటే సన్నముగ నుండును. ఆకుల కొనలు సన్నని మొనదేలియుండును. ఆకు తొడిమ సుమారు 4-5 అంగుళముల పొడవుండును. రేకు 12-18 అంగుళముల పొడవు, ½ మొ. 1¼ అంగుళము వెడల్పు కలిగియుండును. కొర్ర వెన్ను 5-8 అంగుళముల పొడవుండును. దానియందు నూగు ఉండును. చోడికి వలెనే కొర్ర మొక్కకు కూడ

చిత్రము - 197

కొర్ర వెన్ను.

పటము 4

కొన్ని భాగములు ఊదారంగు కలిగిఉండును. గింజల రంగు, వెన్ను యొక్క వైఖరి, దానియందున్న నూగు స్వభావమునుబట్టి కొర్రలో కొన్ని ముఖ్యమగు రకములు గలవు. కొర్ర గణములో చేరిన 'నక్కకొర్ర' యను మరియొక ప్రత్యేక జాతి సస్యము కూడ కొన్ని తావు లందు సాగులో నున్నది. కొర్ర వేడిమిని, చలిని గూడ ఓర్చుకొని పెరుగు సస్యము. ఇది మెట్టపైరుగను, పల్లపు పైరుగను సాగుచేయబడును. దీనికి జిగురు నేలలు అనుకూలము.

ఇంగ్లీషు భాషలో దీనిని 'ఇటాలియన్ మిల్లెట్' (Italian Millet) అనియు, లాటిన్ భాషలో 'సెటేరియా ఇటాలికా' (Setaria Italica) అనియు పిలిచెదరు. దీనిని నూరి కీళ్ళ నొప్పులకు పట్లు వేయుదురు; మూత్రవృద్ధి అగును; దీన్ని అన్నము వేడి చేయును; తేలుకాటునకు దీనితో వైద్యము చేయుదురు; కొంచెము