విజ్ఞానకోశము - 3
చిత్తూరు వి. నాగయ్య
వాటిని వేడినీటిలో ఉడకపెట్టినచో సాధారణముగా సరిపోవును. అందువలన ఒక్క బీజకణములు (స్పోర్సు) తప్ప, తక్కిన సూక్ష్మజీవులన్నియు నశించును. శస్త్రచికిత్స చేయుటకు ఇంతమాత్రము చాలదు. కావున పరికరములు మొదలగువాటిని 120° ఉష్ణోగ్రతగల నీటిలో 30 నిమిషముల కాలము ఉడికించెదరు. అందువలన అవి క్రిమిరహితములై బీజకణములు గూడ నశించును.
నవీన వైద్య విధానము, ఎందుండి ఉత్పత్తియైన మందులనైనను స్వీకరించుటకు సంసిద్దముగా నున్నది. మందులు బజారులో విక్రయించుటకు, విడుదలచేయుటకు ముందు వాటిని పరీక్షించి, అందలి మూలసూత్రములను నిర్ణయించి మానవులపైన జంతువులపైన, అందుమూలమున కల్గు శరీరజన్య విష ఫలితములను నిర్ణయింతురు. కండరముల సడలింపునకు ఇప్పుడు వాడబడుచున్న టూబర్ కేన్ అనునది అమెరికాలోని రెడ్ ఇండియనులు ఉపయోగించు బాణవిషము (ఆరోపాయిజన్) నుండి తీయబడినది. సర్పినా అను పేరిట నేడు ఉపయోగించ బడుచున్న మందు ఆయుర్వేదము నుండి స్వీకరింపబడినది. నవీన వైద్యశాస్త్రము అంతర్జాతీయ దృక్పథము కలది. అది స్తబ్ధముకాదు. చైతన్యవంతము. నూతనఔషధములు కనుగొని వైద్యశాస్త్రమునకు పుష్టినిచేకూర్చుటకు ప్రపంచములో నలుదిశల పరిశోధనములు జరుపబడుచున్నవి.
యస్. వేం.
చిత్తూరు వి. నాగయ్య :
తెలుగు సినిమా కళాలక్ష్మికి గత రెండున్నర దశాబ్దముల నుండి పాదపూజ సలిపి, కర్పూరహారతులు పట్టిన
మహానటులలో చిత్తూరు నాగయ్య అగ్రతాంబూలమునకు అర్హుడనుటలో అతిశయోక్తి యుండబోదు.
శ్రీ నాగయ్య 1907 ఏప్రిల్ 12 వ తేదీన గుంటూరు మండలము నందలి రేపల్లెలో జన్మించిరి. ఆయన తండ్రి వి. ఆర్. శర్మ రేపల్లెయందు కొంతకాలము తహసీల్‌దారుగా పనిచేసిరి. శర్మ సంగీతమునందు చక్కని అభిరుచి గలిగి యుండెను. వయొలిన్ వాయించుచు వారు తీరిక సమయములలో నాదబ్రహ్మమును ఉపాసించెడి వారు. ఆ నాదమే పసితనమున నున్న నాగయ్య చెవులలో పడి ఆయనకు సంగీత కళాపిపాసను చేకూర్చెను.
నాగయ్య అయిదు నెలల పసికందుగా నున్నప్పుడు, ఆతని జీవితములో ఒక చారిత్రక సంఘటన జరిగెను. తల్లి వెంకటలక్ష్మమ్మ పసిబిడ్డను ఒంటరిగా తొట్టెలో పండు
చిత్రము - 191
పటము - 1
మహానటుడు చిత్తూరు నాగయ్య
కొనబెట్టి మంచినీరు కొరకై సమీపమున నున్న బావికి వెళ్ళెను. మంచినీరుతో తిరిగి ఇంటిలో అడుగుపెట్టిన తల్లి, తన బిడ్డమీద ఒక నల్లని నాగుబాము పడగవిప్పి ఆడుట చూచెను. ఒకక్షణము వరకు ఆమె గుండెలో గుండె లేకుండెను. భక్తురాలగుటచే, ఆమె మరుక్షణములో తేరుకొని నాగేంద్రుని సమక్షమున ధూప, దీప, నైవేద్యాదు లుంచెను. అనంతరం మా నాగుబాము నైవేద్యమును స్పృశించి వచ్చిన మార్గముననే బయటకు సాగిపోయెను. భర్త ఇంటికివచ్చిన వెంటనే ఆమె ఈ యుదంతమును అతని కెరుకపరచెను. దంపతు లిరువురు నాగప్రతిష్ఠ జరపి, పిల్లవానికి 'నాగయ్య' యని నామకరణము చేసిరి.
అయిదేళ్ళ వయస్సొచ్చిన నాగయ్యకు ఇతర విద్యలతోపాటు సంగీతమునుగూడ తండ్రి స్వయముగ నేర్పెను.
669