పుట:Sangraha Andhra Vijnana Kosham Volume Three.pdf/719

ఈ పుట అచ్చుదిద్దబడ్డది

విజ్ఞానకోశము - 3

చార్వాకము

బడిన శబ్దప్రమాణము (testimony), అనుమానప్రమాణమువలెనే అనిశ్చయమైనది. చార్వాకుడు వేదముల ప్రమాణమును తీవ్రముగా ఖండించెను. చార్వాకుల సిద్ధాంతములను బట్టి, వేదములు అసత్యసంగతము, స్వవచనవ్యాఘాతము, పునరుక్తి అను దోషములచే దూషితము లైనవి.

ఆధ్యాత్మికవాదము (metaphysics) : పదార్థమనున దొక్కటే యథార్థమైనది. ఎందుకనగా అదొక్కటే ఇంద్రియములకు గోచర మగును. భూమి, జలము, అగ్ని, వాయువు అను చతుర్భూతములు శాశ్వతము లైనవి. సృష్టిలో ప్రాక్తనజాతి జంతువులనుండి, తాత్త్వికునివరకు ప్రపంచముయొక్క పరిణామమునుగూర్చి వివరింప గల్గినవి. ఈ చతుర్భూతములు మాత్రమే. మేధ అనునది చతుర్భూతములయొక్క వికారమే (Modification). చతుర్భూతములనుండి ఉత్పన్నమైన మేధకూడ చతుర్భూతములు విడివడి పోవుటతో నశించును. చతుర్భూతములు సంఘటితమైనచో, ఆత్మచైతన్యముగల ప్రాణము విచిత్రముగా ఉద్భవింపగలదు. ఆత్మ అనునది శరీరము కంటె భిన్నమైనదిగ మనము పరిగణింప నవసరములేదు. తమలపాకు, సున్నము, పోకచెక్క, ఈ మూడింటిని కలిపి తాంబూల చర్వణము చేసినప్పుడు ఏర్పడు ఎరుపు రంగువలెనో, లేదా ప్రారంభములో మత్తులక్షణములు లేని బెల్లపు నీటిని పులియబెట్టినచో అది మత్తుపదార్థముగా పరివర్తనము చెందునట్లుగానో, నాలుగు భూతములు మానవశరీరముగా సంఘటితమైన వెంటనే మేధాశక్తి ఉత్పన్నమగును. ఆత్మఅనగా శరీరమే. ఆ శరీరమే " నేను లావుగా నున్నాను”, “నేను యువకుడను”, “నేను వృద్ధుడను” ఇత్యాది వాక్యములలో ఇమిడియున్న లక్షణములతో అభివర్ణింపబడు చున్నది. మానవుని చిత్తవృత్తి అతడు భుజించు ఆహారపదార్థములపై ఆధారపడి యుండును. సదానందుడు, తాను రచించిన 'వేదాంతసారము' నందు చతుర్విధములైన భౌతికవాదసంప్రదాయములనుగురించి ప్రస్తావించియుండెను. ఒక సంప్రదాయము ఆత్మ, శరీరముల ఏకత్వమును భావించును. మరియొక సంప్రదాయము ఆత్మ. జ్ఞానేంద్రియముల ఏకత్వమును భావించును. మూడవ సంప్రదాయము ఆత్మ, శ్వాసల ఏకత్వమును భావించును. నాల్గవ సంప్రదాయము ఆత్మ మస్తిష్కముల ఏకత్వమును భావించును. ఏ సంప్రదాయ భావనలోను ఆత్మ అనునది ఆధిభౌతిక రూపదర్శనమే (material phenomenon).

పరలోకమున్నదని భావించుట పొరపాటు. ఈ ప్రపంచము తప్ప, స్వర్గనరకము లనునవి లేనేలేవు. ఇవన్నియు వంచకులు భ్రమలు కలుగజేయుటకై పన్నిన కల్పనలు. మతమనునది యొక మానసరుగ్మతవంటిది. ప్రపంచము యొక్క ఆవిర్భావమునకు భగవంతుని ప్రసక్తి అనవసరము.

ప్రపంచమును గూర్చిన చార్వాకుని సిద్ధాంతము ఒక్కొక్కప్పుడు స్వభావవాదము (Naturalism) అనియు, యదృచ్ఛావాదము (Mechanism) అనియు పేర్కొనబడుచున్నది. విశ్వసృష్టికి కారణభూతముగ చిన్మయానంద స్వరూపుడగు భగవంతుని అస్తిత్వమును అంగీకరింపక, ప్రపంచము కేవలము చతుర్భూతాత్మకమైన సంఘటిత పదార్థ సంజన్యమే యని చార్వాకుడు వివరించుటచేత, ఆతనిమతమును 'స్వభావవాద' మనియు, 'యదృచ్ఛావాద' మనియు కొందరు పేర్కొనుచున్నారు.

చార్వాక సిద్ధాంతముతో 'ఎంపెడోకిల్స్' (Empedocles) అను నాతడు ప్రతిపాదించిన తాత్త్విక సూత్రములను పోల్చనగును. ఈతని తత్త్వసిద్ధాంతమందును చతుర్భూతముల ప్రసక్తి కలదు. అంతేకాక రెండు పరివర్తన సూత్రముల ప్రసక్తియు కలదు. 1. ప్రేమ ఐక్యమును సిద్ధింపజేయును; 2. ద్వేషము వైరుద్ధ్యమును కలుగజేయును.

నైతికశాస్త్రము (Ethics) : మానవజాతియొక్క శీలవంతమైన ప్రవర్తనమే నైతికశాస్త్ర మనబడుచున్నది. దేహాత్మవాదము (materialism) నకు సంబంధించిన శాస్త్రము లన్నియు 'లోకాయతము'ను గూర్చి ముచ్చటించుటచే, ఆనందము, ఆవేదనము జీవితములో ముఖ్యములైన అంశములై యున్నవి. "తిని, త్రాగి, ఆనందించుడు. ఏలయన సకలజీవులకు జీవితాంతమున మరణము సంభవించును. (జాతస్య మరణం ధ్రువం). జీవించియున్నపుడే సౌఖ్యానందములతో జీవింపుము అనునదే చార్వాక మతములోని సారాంశము. “మరణమును ఎవ్వరును

659