పుట:Sangraha Andhra Vijnana Kosham Volume Three.pdf/680

ఈ పుట అచ్చుదిద్దబడ్డది

చరకుడు

సంగ్రహ ఆంధ్ర


చికిత్సావహ్ని వేశస్య స్వస్థాతు రహితం ప్రతి
యది హా౽స్తి తదన్యత్ర యన్నేహాస్తి నతత్ క్వచిత్.
                                              చ. సి. 12-93.

చరక మానాటినుండి ఈనాటివరకు భారతీయ ఆరోగ్యశాస్త్రమగు ఆయుర్వేద సిద్ధాంత వ్యవస్థాపనయందు అగ్రగణ్యత వహించి విద్వద్వైద్య జీవనసంజీవనముగా, సకల పురాణేతిహాస సంగ్రహముగా ఆర్ష విజ్ఞాన విద్యోతితముగా, వేదమయముగా, మానవధర్మసర్వస్వముగా ప్రకాశించుచున్నది. ఇందలిధర్మములు, ఆయుర్వేద ధర్మములను శీర్షికయందు కోశముననిరూపింపబడియున్నవి. ఇచట నిర్దేశింపబడిన అనేక ధర్మములలో ముఖ్యము శరీర రక్షణము. ఆయుఃపాలనము . ఇందు కనువదితములగు కొన్ని వాక్యములు ఇచట చూడనగును.


ధర్మార్థకామమోక్షాణా మారోగ్యం మూలముత్తమం
రోగా స్తస్యాపహర్తారః శ్రేయసో జీవితస్యచ.
                                            చ. సూ. 1-15.

ధర్మార్థకామమోక్షములను ఉపార్జించుటకు ప్రధానమైనది, ఉత్తమమైనది ఆరోగ్యము. అట్టి పవిత్ర మైన జీవితముయొక్క ఆరోగ్యభాగ్యమును రోగములు హరించునవిగా నున్నవి.


సర్వమన్య త్పరిత్యజ్య శరీర మనుపాలయేత్
తదభావేహి భావానాం సర్వాభావ శ్శరీరిణాం. చ.

మనుజుడు ఇతర పనుల నన్నిటిని విడిచి శరీరమును జాగ్రతగా సంరక్షించుకొన వలయును. చతుర్వర్గసాధ నానుభూతమైన శరీరము లేనివాడు, సర్వముండియు లేనియట్లే.


సాహసం వర్జయే త్కర్మ రక్షన్ జీవితమాత్మనః
జీవన్‌హి పురుష స్త్విష్టం కర్మణః ఫలమశ్నుతే.
                                               చ. ని. 6-6.

తన జీవితమును కాపాడుకొన తలచిన మానవుడు సాహసించి తన శరీరబలమునకు మించిన పనులను చేయ బూనుకొనరాదు. మానవుడు సజీవుడై యుండినగాని ఇష్టా పూర్తములగు తాజేసిన కర్మఫలముల ననుభవింపజాలదు.


ఆత్మాన మేవ మన్యేత కర్తారం సుఖదుఃఖయోః
తస్కాత్ శ్రేయస్కరం మార్గం ప్రతిపద్యేతనోత్ర సేత్ .
                                                 చ. ని. 7-25.

మనుజుడు తన సుఖదుఃఖములకు తానే కర్తయని తలంపవలయును. కావున తనకు శ్రేయోదాయక మగు మార్గము ననుసరించి పోవలయును. భయపడరాదు.


నగరీనగరస్యేవ రథస్యేవ రథీ యథా
స్వశరీరస్య మేధావీ కృత్యేష్వవహితో భవేత్.
                                     చ. సూ. 5-100.

ఒక మహాపట్టణమును నగరరక్షకుడు కాపాడుచుండునట్లును, ఒక మహారథికుడు తన రథమును శత్రువుల కభేద్యముగా సంరక్షించుకొను చుండునట్లును, బుద్ధిమంతుడగు మనుజుడు తన శరీర సంరక్షణమున కవసరములగు పనులయందు హెచ్చరికగలవాడై (అప్రమత్తుడై) యుండవలయును.


పురుషో మతిమాన్ ఆత్మనః శరీరమనురక్షన్ శుక్రమను
రక్షేత్ పరాహ్యే షా ఫల నిర్వృత్తి రాహార స్యేతి.
                                            చ. ని. 6-15.

శరీరమును కాపాడుకొన దలచిన బుద్ధిమంతుడగు మానవుడు శుక్రమును సంరక్షించు కొనవలయును. ఈ శుక్రము ఆహార పరిణామ ఫలరూపమై యున్నది.


ఆహారస్య పరంధామ శుక్రం తద్రక్ష్య మాత్మనః
క్షయోహ్యస్య బహూన్‌రోగాన్ మరణంవానియచ్ఛతి.
                                                చ. ని. 6-16.

శుక్రము ఆహారముయొక్క ఉత్తమ పరిణామము గలది. ఆత్మ సంరక్షణమునకై మనుజుడు తన శుక్రమును సంరక్షించు కొనవలయును. శుక్రము క్షీణించుటవలన అనేక రోగములు కలుగవచ్చును. లేక మానవుడు మృత్యువు నొందవచ్చును.


నిత్య సన్నిహితామిత్రం సమీక్ష్యాత్మా నమాత్మవాన్
నిత్యం యుక్తః పరిచరేత్ ఇచ్చన్నాయు రనిత్వరం.
                                            చ. సూ. 17-117.

వివేకవంతుడగు మనుజుడు - వ్యాధిరూపమైన శత్రువు నిత్యము నీడవలె తన్ననుసరించి వర్తించుచున్న దని గ్రహించి, ఆయుస్సంరక్షణమునుగోరి నియమవర్తనుడై శరీరమును నిత్యమును ఉపచరించు చుండవలయును.

అనేక ఉదాహరణములతో శరీరరక్షణ మిట్లుపదేశింప బడినది. శరీర పోషణమునకు, ఆయుస్సంరక్షణమునకు,

620