పుట:Sangraha Andhra Vijnana Kosham Volume Three.pdf/679

ఈ పుట అచ్చుదిద్దబడ్డది

విజ్ఞానకోశము - 3

చరకుడు

సంవత్సరములు. ఎంత యుదారముగా వెనుకకు చూచినను, ధర్మజుని కాల మీనాటికి 5 వేల 200 సంవత్సరములకు పైన పోజాలదు. చరకుడు ధర్మజునకు పూర్వుడనుట నిర్వివాదము. సంస్కర్తకంటె గ్రంథకర్త పూర్వుడుగా నుండి యుండవలయును గదా ! అందుచే రసాయన తపోవ వాస బ్రహ్మచర్యవ్రతాభ్యాసముల వలన అనియ తాయుర్దాయువులగు మహర్షుల కోవలోనివాడగు అగ్ని వేశుడు ధర్మజుని కాలమునం దున్నను, చరకునికంటె పూర్వము వాడై యుండు నని నిస్సందేహముగా చెప్పవచ్చును. చరకాగ్ని వేశుల మధ్యగత మయిన కాలముఅనూహ్యము.


విస్తారయతి లేశోక్తం సంక్షిప త్యతివిస్తరం
సంస్కర్తా కురుతే తంత్రం పురాణం చ పునర్నవం.
                                           (చ. సి. 12-68)

సంస్కర్త యగు నతడు పూర్వతంత్రమునందు సూత్రప్రాయముగ చెప్పిన విషయములను ఇతరులకు చక్కగా తెలియునట్లు విస్తరింపజేసియు, అతిదీర్ఘములుగ జెప్పిన విషయములను సులభముగా గ్రహించునట్లు సంగ్రహింయు, జారిపోయిన విషయములను సంతరించియు, వ్యత్యస్తవిషయములను సవరించియు, ఆ ప్రాచీనతంత్రమునకు మెరుగుదిద్ది నూతనత్వము నాపాదింప జేయును. ఇదియే చరకు డగ్ని వేశుని తంత్రమునకు సమకూర్చిన నవ నవోన్మేషత.

ఆ కారణములు ప్రమాణములుగా బ్రహ్మమొదలు ఆయుర్వేదము వ్యాప్తియం దుండుటచేతను ఋగథర్వణములు ఆయుర్వేదమునకు మూలము లగుటచేతను (ఋగ్వేదమునకు ఆయుర్వేదము ఉపవేదమైనట్లు చరణవ్యూహమున వ్యాసుడు) ఆయుర్వేద మనంతకాలప్రాప్తము; వ్యాప్తిగలది. చరకాగ్ని వేశు లిరువురు యుగయుగాంతరముల పురాణపురుషులు. చరక రచన, పాతంజల యోగదర్శనము, పాణిని వ్యాకరణ మహాభాష్యము, అగ్ని వేశ తంత్ర ప్రతిసంస్కరణము - ఇవి చరకుని రచనలు. ఇందు స్వతంత్ర రచన యోగదర్శనము; పరతంత్ర పరామర్శనము వ్యాకరణ మహాభాష్యము ; సమగ్ర స్వతంత్ర సాధనము చరక సంహితగా ప్రసిద్ధిగాంచిన అగ్నివేశతంత్రము.

యోగదర్శనము నాలుగు పాదములు, ఎనిమిది అంగములు గలది. ప్రథమ పాదమునందు 'అథయోగాను శాసనం, యోగ శ్చిత్తవృత్తి నిరోధః" అని ప్రారంభించి, యమ, నియమ, ఆసన, ప్రాణాయామ, ప్రత్యాహార, ధ్యాన, ధారణ, సమాధి, రూప - అష్టాంగములు సలక్షణములుగ వివరింపబడినవి. ద్వితీయ పాదమునందు 'తపస్స్వాధ్యాయేశ్వర ప్రణిధానాని క్రియాయోగః' అని వివిధ విషయవాసనాప్రోత్థితమగు చిత్తనిరోధక క్రియా యోగములైన యమ, నియమ, ఆసన ప్రాణాయామ, ప్రత్యాహారములను ఐదంగములు బహిరంగ సాధనములుగా నిర్దేశింపబడి, అభ్యాసపూర్వకముగ వివరింపబడినవి. తృతీయపాదమునందు, 'దేశబంధః చితస్యధారణా' అని ధ్యాన, ధారణ, సమాధులను మూ డంగములను అంతరంగ సాధనములుగా, సక్రియాత్మకములుగా వివరింపబడినవి.

చతుర్థ పాదమునందు, 'జన్మ, ఔషధ, మంత్ర, తపస్సమాధిజాః సిద్ధయః' అని సిద్ధపంచకము, ప్రయోజనము, కైవల్యము, పంచవింశతి తత్వములు, క్లేశకర్మవిపాకాశయము అను వాటితో గూడుకొనిన పురుషుడు స్వేచ్ఛాను. యాయియై,నిర్మాణకాయము నధిష్ఠించిపారలౌకికత్వము నందుట వివరింపబడినది. మొత్తము మీద యోగదర్శనమంతయు జీవన్ముక్తత్వమును, పరమేశ్వర తత్వదర్శనత్వమును కలిగించి, జీవాత్మ పరమాత్మలకు అభేద ప్రతిశ్రయమగు శాశ్వత బ్రహ్మానంద మనుభవించుటను తెలియ జేయును.

వ్యాకరణమహాభాష్యము : ఇది గీర్వాణవాణీసామ్రాజ్య భద్రపీఠము; ఇది లేనిచో జాతి, సంస్కృతి సజీవముగా నుండజాలదు.

చరకసంహిత : ఇది ప్రతి సంస్కరింపబడిన అగ్నివేశ సంహిత. ఈ ప్రతి సంస్కరణమునందు చరకుని ప్రతిభా విశేషము, కేవల శేషత్త్వ ప్రభావత్త్వము సహస్రముఖముల ప్రదర్శిత మగుచుండును. గ్రంథము ఎనిమిది స్థానములు ; నూట ఇరువది యెనిమిది అధ్యాయములు ; పండ్రెండువేల సూత్రములు గలది. త్రివర్గసాధనమునకు, తిస్రైషణప్రాప్తికి ఇందు చెప్పబడిన సాధన సమున్నయము సర్వతంత్రములయందును సమృద్ధముగా గలదు. ఇందు విడిచిపెట్టిన దెద్దియు ఇతర తంత్రములందు లభ్యముకాదు. అని గ్రంథాంతమున ప్రతిజ్ఞా పూర్తిగ చెప్పబడినది. ఇది అక్షరశః నిజము.

619