పుట:Sangraha Andhra Vijnana Kosham Volume Three.pdf/677

ఈ పుట అచ్చుదిద్దబడ్డది

విజ్ఞానకోశము - 3

చరకుడు

యందు ఆయా దేశములలో సంచరించి, సంగ్రహించి, సంరక్షించి, తిరిగి ప్రకాశమునకు, ప్రచారమునకు, తెచ్చు చుండినట్లు, అట్టి కళారాధకు లానాడు చరకులుగా చెప్పబడినట్లు ఈ గాథవలన తెలియుచున్నది. ఇందు చరకుడుగా, గ్రంథకర్తగా, ప్రఖ్యాతిగనినవాడు పతంజలి మహర్షి. ఇది చరకుడుగా పతంజలి మహర్షికిని ఆయుర్వేదమునకును సంబంధము గల వైదికగాథ. ఇందుకు పౌరాణికముగ మరియొకగాథ గనుపడుచున్నది. ఆది ఇది:

మత్స్యావతారమున శ్రీ మహావిష్ణువు వేదముల నుద్ధరించెను. సహస్రఫణామణీ విరాజితుడగు ఆది శేషుడా సమయమున ఆవేదవేదాంగములను, అధర్వణాంతర్గత మగు ఆయుర్వేదమును గ్రహించెను. పిమ్మట ఆదిశేషు డొకసారి మారువేషముతో భూమండలమును చూడవలెనని తిరుగుచు, భూమండలమునందు మానవులు ఆధి వ్యాధులకును, ఆకలిదప్పులకును, జనన, జరా, మరణములకును లోనై, దుఃఖితు లగుచుండుటను జూచెను. కరుణార్ద్ర హృదయు డగుటచే శేషు డా దుఃఖితులను జూచి, తానును దుఃఖపడెను. (ఆకలి, దప్పికలు, జరా మరణములు స్వాభావిక వ్యాధులుగా ఆయుర్వేదము నిశ్చయించినది). ఇట్టి దుఃఖముల నుండి ఎటెనను మానవులను కాపాడవలయునను భావముగలిగి, శేషుడు తానొక ఋషికుమారుడుగా మారి, ఒక మహర్షి కుటుంబమునకు వచ్చిచేరెను. ఆ కుటుంబమువా రీతని ఓజస్తేజో ప్రభావములను, నయవినయ ప్రతిభా ప్రజ్ఞావిశేషములను జూచి ఆప్యాయతతో తమ కుటుంబము వానినిగా జూచుకొనుచుండిరి. కులగోత్రములు తెలియక. దేశద్రిమ్మరిగా వచ్చిన వాడగుట - ఆ కుమారుని ఆ కుటుంబమువారు 'చరకు'డని పిలుచుచుండిరి. ఈ చరకుడు, పునర్వసు ఆత్రేయ శిష్యులగు అగ్ని వేశాదులు, తమతమ పేర్లతో రచించిన ఆయుర్వేద తంత్రములను చరకుడు ప్రతిసంస్కరించి ఒకట సమకూర్చెను చరక సంస్కృతమై ప్రచారమునకు వచ్చిన దగుట ఈ తంత్రమునకు చరక సంహిత యని ప్రసిద్ధి ఏర్పడినది.

ఇందుకు భావప్రకాశమునందు ప్రమాణ మిట్లు గలదు:


యదా మత్స్యావతారేణ హరిణా వేద ఉద్ధృతః
తదాశేషశ్చ తత్త్రెవ వేదం సాంగమవాప్తవాన్ 57

అధర్వాంతర్గతం సమ్య-గాయుర్వేదం చ లబ్ధవాన్
ఏక దా సమహీవృత్తం ద్రష్టుంచర ఇవాగతః 58

తత్రలోకాంగదైర్గ్రస్తాన్ వ్యథయా పరిపీడితాన్
స్థలేషు బహుషువ్యగ్రాన్ మ్రియమాణాం శ్చ దృష్టవాన్ 59

తాన్ దృష్ట్వాతిదయాయుక్తః తేషాం దుఃఖేన దుఃఖితః
అనన్త శ్చిన్తయామాస రోగోపశమకారణం 60

సంచిన్త్య సస్స్వయం తత్రమునేః పుత్రో బభూవహ
ప్రసిద్ధస్య విశుద్ధస్య వేదవేదాంగ వేదినః 61

యత శ్చర ఇవాయాతో నజ్ఞాతః కేనచిద్యతః
తస్మా చ్చరకనామ్నాసౌ ఖ్యాతశ్చ క్షితిమండలే 62

సభాతి చరకాచార్యో వేదాచార్యో యథా దివి,
సహస్రవదనస్యాంశో యేన ధ్వంసోరుజాం కృతః 63

ఆత్రేయస్య మునే శ్శిష్యా అగ్నివేశాదయో౽భవన్
మునయో బహవస్తైశ్చ కృతం తంత్రం స్వకం స్వకం. 64

తేషాం తంత్రాణి సంస్కృత్య సమాహృత్య విపశ్చితా
చరకేణాత్మనో నామ్నా గ్రంథోయం చరకస్స్మృతః 65


ఈ గాథలు రెండును చరకుడు శేషాంశ సంభవుడనుటకును, ఆయుర్వేద సముద్దారకు డనుటకును ప్రమాణములుగానే యున్నవి. ఈ చరకుడే పతంజలియని ప్రసిద్ధి. దేశకాల వైపరీత్యములచే వేదవేదాంగ పఠనము, శాస్త్రాభ్యాసము, కళానైపుణ్యము, నైతిక వర్తనము, సత్యధర్మ ప్రవృత్తి ప్రజలయందు సన్నగిలినప్పుడు, దైవాంశమున మహాపురుషు లుద్భవించుటయు, ఆయా ధర్మములను యధాపూర్వముగ సముద్దరించుటయు జరుగు నని ఆర్షవాణి తెలియజేయుచున్నది. ప్రత్యక్షముగ జగమెరిగిన నగ్నసత్య మిది.

చరకాగ్నివేశుల కాలనిర్ణయము : వేద వాఙ్గ్మయ ప్రాప్తికి, ఆర్ష విజ్ఞాన వ్యాప్తికి కాలకర్తృత్వ పరిగణనము అనూహ్యము. భౌతికజ్ఞానమునకు అందని అతీంద్రియ గ్రాహ్యమగు విషయ మిది : ‘నమిథ్యా ఋషిభాషితం.' (వా. రా. యు. 60-12) ఆత్మశక్తి సంపన్నులును. త్రికాలజ్ఞులును అగు మహర్షుల వాక్యములు అసత్యములు గావను నిబ్బరముతో, నిస్సంశయాత్మతో ప్రర్తింపవలసినదే. చరకుడు గాని, అగ్ని వేశుడుగాని ఈ కాలమువారే యని నిశ్చయించుటకు ఆధారములు అందుబాటులో లేవు. కాని పతంజలిగా చరకుడు యాజ్ఞవల్క్యుని

617