విజ్ఞానకోశము - 3
చదరంగము - 2
వలన క్రమముగ పెంపొందును. చదరంగమున దూరదృష్టి కలిగి, రాగల శత్రుబలగపు దాడిని గమనించుచుతగు శ్రద్ధతో తన రాజును కాపాడుకొనవలెను. పరిస్థితులను పూర్తిగా పరిశీలించి అవగాహన మొనరించుకొనవలెను. పరిశీలనవలన కలుగు యూహలను బాగుగాయోజించి స్థిరత్వము కలిగి అనుసరింపబోవు విధానమును నిర్ణ యించుకొనవలెను. అట్టి నిర్ణయముల నెట్టిపొరబాటులను నాచరింపక ఏకాగ్రత కలిగి అమలుపరచుకొనవలెను. ఈ క్రమమునందేది లోపించినను, విజయము లభింపదు. అందుచేతనే వాస్తవిక జీవితమునకును చదరంగమునకును సన్నిహిత సంబంధము కలదని దృఢపడుచున్నది. జీవితమున మానవునకు తటస్థించబోవు ఆపదలను, కష్టములను దూరదృష్టి కలిగి తప్పించుకొనుటయు, విధివశమున కలిగినక్లిష్ట పరిస్థితుల నెదుర్కొనుచు వానిని పరిస్కరించుకొనుటకు చేయబడు తీవ్ర మానసిక ప్రయత్నములును, చదరంగపు ఆటయం దనుసరించు విధానములవంటివే కదా ! అందుచే చదరంగము జీవితపు పోరాటమున విజయసాధనకు మానవున కనుకూలించు శక్తులను సృష్టించి, అలవడునట్లుచేయు క్రమబద్ధమగు శాస్త్రమని చెప్పవచ్చును.
చదరంగమునందు ప్రావీణ్యమును సాధించినవాడు తన యాటయందే లగ్నమై పరిసర వాతావరణమునకు లోబడక ఏకాగ్రత కలిగిన స్థిరత్వమును కలిగి తన లక్ష్యమును సాధించుటకు తీవ్రకృషి చేయును. రెండు విరుద్ధ భావములు గల ప్రకృతులు తమ మేధాసంపత్తిని ప్రయోగించుచు నొకదానిపైనొకటి విజయమును సాధించుటకు చేయబడు విధివిరామము లేని పోరాటమే చదరంగము.
ఆనంద మనుభవించుటయే కదా జీవితపరమావధి! అట్టి ఆనంద మనుభవించుటకు కలుగు అవరోధ పరంపరను తన లక్ష్యసాధన సహాయసంసత్తులచే నశింపుచేయుట కొనరించు నిరంతర జీవితపు పోరాటమే నల్ల, తెల్ల బలగములు గల చదరంగ క్రీడ యందలి పోరాటము. అందుచే చదరంగము ముక్తిమార్గమును సాధించుటకనుకూలించు సాధనయనెడి క్రీడారూపమగు కళ యని గ్రహింప నగును.
ఆట - వివరము : ఈ ఆట 1 మస్తు, 2 నిర్మస్తు, 3 అంతర్జాతీయము అను మూడు విధములుగ ప్రచారమున గలదు. ఉభయగోదావరి, కృష్ణా, గుంటూరు జిల్లాలయందు మస్తు విధానమును, విశాఖ, గంజాము జిల్లాల యందు నిర్మస్తు విధానమును, మిగిలిన ప్రపంచమందంతటను అంతర్జాతీయ విధానమును ప్రచారమున గలదు. ప్రస్తుతము మస్తు, నిర్మస్తు విధానముల నాడెడువారుకూడ, అంతర్జాతీయ మవలంబించుకొని, మిగుల కృషిచేయుచు, ఇతరరాష్ట్రము లందు జరుగు పోటీల యందును, అఖిలభారత పోటీల యందును పాల్గొనుచు, తమ ప్రతిభను వెల్లడించుకొను చున్నారు.
బల్ల - బలగము - నడకలు :
బల్ల : వరుసకు ఎనిమిది చదరములవంతున ఎనిమిది శ్రేణులుగ, మొత్తము అరువదినాలుగు చదరపు గళ్ళు కలిగియుండును. గడి విడిచి గడికి ఒక రంగు చొప్పున మొత్తము గళ్ళకు రెండు రంగులు వేయబడియుండును.
బలగము : రెండు రంగులుగ నుండును. ఒక ఆటగాడు ఒకరంగు బలగమును, రెండవ ఆటగాడు రెండవ రంగు బలగమును గ్రహించి ఆటను ప్రారంభింతురు. ఒక్కొక్క రంగునందు రాజు, మంత్రి గాక రెండు ఏనుగులు, రెండు గుఱ్ఱములు, రెండుశకటములు, ఎనిమిది బంట్లు నుండును. ఏనుగ, గుఱ్ఱము, శకటములను జంతువులనియు, మిగిలిన వాటిని వాటిపేర్లతోను, మొత్తము ఆటవస్తువులను బలగమనియు వ్యవహరింతురు.
నడకలు : రాజు - తానున్న గడినుండి తిన్నగా గాని మూలగా గాని వెనుకముందులకు ఒక గడి మాత్రమే నడచును. ఇది శత్రురాజు గడి ప్రక్కనున్న గడిని ఆక్రమింపదు. రక్షణ గల శత్రు బలగమును చంపజాలదు.
మంత్రి : తిన్నగా గాని ములగా గాని వెనుక ముందులకు అడ్డులేనపుడు ఎంతదూరమైనను నడచును. ఇది బలగమంతటిలో మిక్కిలి శక్తిగలది. ఏనుగువలెను, శకటమువలెను గూడ నడచును.
శకటము : మూలగా మాత్రమే, వెనుక ముందులకు అడ్డులేనిచో ఎంతదూరమైనను నడచును. నల్లగడి శకటము నల్లగళ్ళలోను, తెల్లగడిశకటము తెల్లగళ్ళలోనుమాత్రమే నడుచును.
ఏనుగ : తిన్నగానుండు గళ్ళలో నిలువుగా గాని, అడ్డముగా గాని నలుదిక్కులకు అడ్డులేనిచో ఎంత దూరమైనను నడచును.
611