పుట:Sangraha Andhra Vijnana Kosham Volume Three.pdf/670

ఈ పుట అచ్చుదిద్దబడ్డది

చదరంగము - 2

సంగ్రహ ఆంధ్ర

అథర్వవేదములోను ప్రస్తావనము కలదు. ఈ క్రీడ హిందువులకు మిక్కిలి ప్రీతిపాత్రమైనదిగా కనబడుచున్నది.

చతురంగ క్రీడనుండి యుద్ధసంబంధమైన చతురంగబల నిర్మాణపద్ధతి ఏర్పడినదా ? లేక చతురంగబల నిర్మాణ విధానమునుండి చతురంగ (చదరంగ) క్రీడ ఏర్పడినదా? అనునది విచారణీయాంశము. కౌటిల్యుడు, శుక్రాచార్యులు, వైశంపాయనుడు నిబంధించిన విషయమునుబట్టి చూడగా, చదరంగపుఆట విధానము ననుసరించియే యుద్ధవిధానమున చతురంగబల నిర్మాణము ఏర్పడినట్లు తెలియుచున్నది. కాబట్టి చతురంగ క్రీడనుండియే చతురంగబల నిర్మాణవిధానము ఏర్పడినట్లు తేలుచున్నది. అయితే, చతురంగబలముల విధానమును అనుసరించియే చతురంగక్రీడ ఆకారము దాల్చిన దని భావించ కూడదా ? అవును కాని, చతురంగబలముల ప్రస్తావన తరువాత వెలసిన పురాణ గ్రంథములలోనేగాని వేద వాఙ్మయములో కనబడదుకదా ! 'మరియు వేద వాఙ్మయములో చతురంగక్రీడ విషయము విశేషముగా గలదు. కావున చతురంగ క్రీడనుండియే చతురంగబల విధానము ఏర్పడిన దనుట సహజముగ, సమంజసముగ నుండగలదు. ప్రపంచ వాఙ్మయములో ఋగ్వేదము ప్రథమ గ్రంథముగ పరిగణింపబడినందునను, ఆ ప్రథమ గ్రంథము చతురంగక్రీడను పేర్కొనుచుండుటచేతను, ఈ క్రీడకు పుట్టినిల్లు భారతదేశమే యగుచున్నది.

ప్ర. రా. సు


చదరంగము - 2 :

చదరంగము చాల పూర్వకాలమునుండి యిండ్లయం దాడబడు ఆటలలో గొప్పదిగా పరిగణింపబడి జనబాహుళ్యమునందు వ్యాప్తిచెంది రాజులచేగూడ ప్రోత్సహింప బడినది.

ఈ ఆటకు భారతదేశమే పుట్టినిల్లు. మన పురాణ గ్రంథములగు రామాయణ, భారత, భాగవతములందును, తదితరములగు విక్రమార్క చరిత్ర, కల్హణుని రాజతరంగిణి, రుద్రటుని కావ్యాలంకారము, భట్టబాణుని హర్ష చరిత్రము. విష్ణుపురాణము, హరివంశము, పాత్స్యాయనుని కామసూత్రములు మొదలగు ప్రాచీన గ్రంథము లందును ; మహాయాన బౌద్ధగ్రంథమగు సధర్మ పుండరీకమునందును, హీనయాన బౌద్ధగ్రంథ మగు బ్రహ్మజాల సుత్తమునందును “అష్టాపద" మనుపేర చదరంగ ప్రసక్తి కలదు. పరదేశీయు లగు సర్ థామస్ హైడ్, హెరాల్డు ముర్రే మొదలగు చదరంగ చరిత్రకారులుకూడ చదరంగమునకు భారతదేశమే పుట్టినిల్లని తమ గ్రంథముల యందు రచించిరి.

చదరంగ మను పదము మన పురాణ గ్రంథముల యందు సైన్యమునకు బదులుగ వాడబడినది. చతురంగ మన నాలుగు భాగములు గల సైన్యమని భావము. ఈ ఆటకూడ రాజు, మంత్రి గాక ; ఏనుగు, గుఱ్ఱము, శకటము, బంటు అను నాలుగు విధములగు ఆటవస్తువులను సైన్యముతో అరువది నాలుగు గళ్ళుగల బల్ల యను యుద్ధరంగమున ఇద్దరు ఆటగాండ్రచే నాడబడును. ఒక ఆటగాడు తన బలము సహాయమున మరియొక ఆటగాని రాజును బంధించుటకు తన బుద్ధిబలమును ప్రయోగించి తన లక్ష్యమును సాధింప యత్నించును.

చదరంగము - విలువ : చదరంగము కాలము గడుపుకొనుటకును, వినోదము కొరకును నాడబడు ఆట యని పలువురు తలంచుచుందురు. ఇది క్రీడమాత్రమే కాదు. మేధాశక్తి సముపార్జనకు తోడ్పడు కృషి రూపమగు శాస్త్రము ; ముక్తిమార్గ సాధన కనుకూలించు క్రీడా రూపమగు కళ. శరీరావయవములకు బలము నిచ్చుటకు వ్యాయామక్రీడ లెంత యుపయోగమో, అట్లే మానసిక శక్తులకు చురుకుదనము కలిగించి మనోబలమును పెంపొందించుటకు చదరంగ మంత యుపయోగము. ఈ ఆట వలన బాలురకు పిరికితనము నశించి ఉత్సాహము కలుగును. మేధాశక్తి పెంపొందును. దూరదృష్టికూడ అలవడును. ఆట ముగింపు తరువాత చేయబడు సింహావలోకనము వలన తన తప్పు తాను తెలిసికొని అంగీకరించుట, తన ప్రత్యర్థియొక్క గొప్పతనమును గ్రహించి గౌరవించుట, మొదలగు ఉదార గుణములు అలవడును. మేధాశక్తిని పరీక్షించు క్రీడ గనుకనే, పండితమాన్యులచే జరుపబడు అవధానములయందు చదరంగమునకు ప్రాధాన్యము గలదు.

వాస్తవిక జీవితములో సఫలీకృతు డగుటకు మానవున కవసరమగు అర్హత లన్నియు, చదరంగ మాడుట

610