పుట:Sangraha Andhra Vijnana Kosham Volume Three.pdf/669

ఈ పుట అచ్చుదిద్దబడ్డది

విజ్ఞానకోశము - 3

చదరంగము - 1

పశ్చిమ, మధ్యమ ఐరోపాదేశములలో చదరంగమెట్లు ప్రవేశించి, ప్రచారమున కెక్కెనో నమ్మకమైన చరిత్రాధారములు కన్పట్టుటలేదు. స్పెయిను దేశీయులు మహమ్మదీయవిజేతలనుండియు, ఇటాలియనులు బైజాంటైను జాతీయులనుండియు ఈ క్రీడను అభ్యసించినట్లు రూఢిగా తెలియుచున్నది. ఈ రెండు దేశములలో ఏ ఒక్కదాని నుండియైనను ఈ యాట ఉత్తరదిశగా ఫ్రాన్సులో ప్రవేశించి, అచ్చటినుండి స్కాండినేవియా, ఇంగ్లండు దేశములలోనికి పయనించి యుండవచ్చు నని ఊహింపబడు చున్నది.

కొందరు చరిత్రకారుల కథనము ననుసరించి చదరంగము "క్రూసేడ్స్" (Crusades) అను క్రైస్తవమత యుద్ధముల కాలములో ఐరోపాయందు అడుగుపెట్టినట్లు బోధపడుచున్నది. క్రైస్తవ యుద్ధవీరులు ఈ యాటను అభ్యసించి, కాన్‌స్టాంటినోపిలు నగరములో వినోదప్రీతికై ఆడుచుండెడి వారట. కాని, సెయింట్‌పీటర్ డామియన్ అను క్రైస్తవ మతగురువు క్రీ. శ. 1061 సం. లో ఈ అభిప్రాయమును పూర్వపక్షము చేసెను. ఏదెట్లయినను, భారతదేశములో ఆవిర్భవించి, పశ్చిమాశియా, మధ్యప్రాచ్య దేశముల ద్వారమున ఐరోపా ఖండమునకు తరలిపోయిన చదరంగము, పెక్కు సాంకేతిక పరివర్తనముల నొందుచు, భిన్న విభిన్నములైన రీతులలో ఈనాడు ప్రపంచమంతట వ్యవహారమున నున్నది.

ఆటయొక్క క్రమాభివృద్ధి : 'షాత్రంగ్' అను చదరంగ క్రీడ ఐరోపాఖండములో మొట్టమొదటగా ఫ్రాన్సుదేశమున భిన్నరూపములలో పరివర్తనమంది అచ్చటినుండి 15వ శతాబ్దిలో స్పెయిను దేశములో ప్రవేశ పెట్టబడినట్లు ఊహింపబడుచున్నది. ఇటలీవారు ఈ ఆటను మరియొక పేరుతో తమదేశమునందు ప్రవేశపెట్టుకొని, తమ కనుకూలమైన మార్పులు చేసికొనిరి. క్రీ. శ. 1562-1575 సంవత్సరముల నడుమ ఇటలీ క్రీడాకారులు స్పెయిను దేశమునకు వెళ్ళి ప్రత్యర్థులను ఓడించిరట. 18 వ శతాబ్దిమధ్యభాగములో చదరంగక్రీడలో నవశకోదయము జరిగినట్లు విజ్ఞులైన చదరంగ ప్రవీణులు తెల్పుచున్నారు. ఆ కాలముననే ఈ క్రీడను గురించిన సాంకేతిక విధానములు పెక్కు భంగులలో గ్రంథరూపమున ప్రచురింపబడెను. అరేబియా, పాశ్చాత్యదేశములలో పేరుపొందిన చదరంగ క్రీడాకారులు పరస్పరముగా పందెములయందు గెల్చుకొనుచుండిరి.

ఇంగ్లండులో చదరంగము 19 వ శతాబ్దారంభమున నూతనపద్ధతులపై అభ్యుదయ మార్గమున పురోగమించెను. ఆ శతాబ్దిలో ఈ క్రీడయందు ఫ్రాన్సుదేశమున కుండుచు వచ్చిన నాయకత్వము ఇంగ్లండునకు సంక్రమించెను. సర్రాట్ అను ఇంగ్లండు యువకుడు ఈ క్రీడయందు ఆదేశమునందెల్ల మొట్టమొదటి మొనగాడు. ఇతడు ఈ క్రీడకు సంబంధించిన గ్రంథములు కూడ కొన్నిటిని వ్రాసియుండెనట. కెప్టెన్ ఇవాన్సు, జార్జివాకర్, జాన్‌కొక్రేన్, బోడెన్, బర్న్, మాక్‌డోనెల్, బ్లాక్‌బర్న్ మున్నగు ఇంగ్లీషు ఆటగాండ్రు చదరంగములో గణుతి కెక్కియుండిరి. 1830-1840 సంవత్సరములనడుమ జర్మనీ, హంగరీ, అమెరికా మున్నగు పాశ్చాత్య దేశములలో నూతనమైన చదరంగ క్రీడావిధానములు పరిణామ మొందెను.

1851 వ సంవత్సరములో లండను నగరములో ప్రప్రథమముగా అంతర్జాతీయ చదరంగపుపోటీ ఏర్పాటు చేయబడెను. కాని 1910 వ సంవత్సరమునుండి మాత్రమే ప్రతి సంవత్సరము వేర్వేరు దేశములలో ఇట్టిపందెములు క్రమబద్ధమైన సుశిక్షణముతో, నియమములతో, జరగుచున్నవి.

చదరంగములో కాలానుగతముగా క్రొత్త క్రొత్త సాంకేతిక పద్ధతులు అభివృద్ధి నొందుచున్నవి. ఈ క్రీడకు సంబంధించిన సూత్రములను, నిబంధనములను, సాంకేతిక పద్ధతులను డాక్టరు మాక్స్‌లాంగే, లూయీ పాల్సెన్, ప్రొఫెసరు ఆండర్సన్, పాటర్, జుకర్‌టార్ట్, నిమ్జొవిష్ వంటి మేధావులు, ఔత్సాహికులు చదరంగమును నిత్యనూతనముగా అభివృద్ధిపరచి ప్రచారము గావించిరి.

ఉపసంహారము : చదరంగమును సంస్కృతములో 'చతురంగ'మని యనెదరు. చతురంగక్రీడను అష్టపద ఫలకముమీద హిందువులు ఆడుచుండిరి. ఉభయ పక్షములవారికి అష్టపద ఫలకమే యుద్ధరంగముగా నుండి యుండెను. ఈ చతురంగక్రీడనుగూర్చి ఋగ్వేదములోను,

609